శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 3 జులై 2019 (16:33 IST)

రాహుల్ గాంధీ ఓ మొండిఘటం : రాజీనామాపై వెనక్కి తగ్గట్లేదు

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ మొడిఘటంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తన రాజీనామాపై ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
 
రాహుల్ రాజీనామాను సీడబ్ల్యూసీ తోసిపుచ్చింది. అయినప్పటికీ.. రాహుల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇకపై తాను పార్టీ అధ్యక్షుడిని కాదని... ఆలస్యం చేయకుండా తక్షణమే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని పార్టీ నాయకులను కోరారు. అధ్యక్ష పదవికి తాను ఇప్పటికే రాజీనామా చేశానని చెప్పారు. 
 
సీడబ్ల్యూసీ వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, కొత్త అధ్యక్షుడిని నిర్ణయించాలని విన్నవించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామాను ఉపసంహరించుకోవాలని పార్టీ సీనియర్ నేతలంతా కోరుతున్నప్పటికీ ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు. 
 
ఇదిలావుంటే తన రాజీనామా లేఖను రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 'అద్భుతమైన భారత దేశానికి జవసత్వాలు అందించిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేయడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. నాపై అపరిమితమైన ప్రేమ చూపిన దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. జైహింద్' అని ట్వీట్ చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటికీ.. తన సేవలు ఎపుడు కావాలాన్నాసరే తాను అందుబాటులో ఉంటానని రాహుల్ పేర్కొన్నారు.