మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (10:18 IST)

హమ్మ ముసలోడా... రెండో పెళ్లి కోసం ఎంత పని చేశావ్?

ఓ 60 ఏళ్ల వృద్ధుడు చేసిన హంగామా చూసి అక్కడి స్థానికులు, అధికారులు నివ్వెరపోయారు. 60 ఏళ్ల వృద్ధాప్యంలోనూ తనకు రెండో పెళ్లి చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యుత్‌ స్తంభం ఎక్కి కూర్చున్నాడు. కుటుంబసభ్యులు, స్థానికులు ఎంత నచ్చజెప్పినా.. కిందకి దిగలేదు. అయితే, కొన్ని గంటలపాటు కుటుంబసభ్యులు శ్రమపడి ఎట్టకేలకు అతడిని కిందకి దించారు.

ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ధోల్‌పుర్‌కు చెందిన సోర్బన్‌ సింగ్‌ (60) భార్య నాలుగేళ్ల కిందట మరణించింది. అతడికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, కోడళ్లు, అల్లుళ్లు, మనవళ్లు అందరూ ఉన్నా.. భార్యతోడు లేకపోవడంతో ఒంటరితనం అతన్ని నిరాశకు గురిచేసింది.

దీంతో ఇటీవల అతడు రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని ఇంట్లో కుటుంబసభ్యులకు చెప్పాడు. అయితే, ఈ వృద్ధాప్యంలో రెండో పెళ్లి ఏంటని వారంతా అతడిపై కోపడటంతోపాటు పెళ్లి చేయడానికి నిరాకరించారు. దీంతో సోర్బన్‌ సింగ్‌ కుటుంబసభ్యులపై అలిగి సమీపంలో ఉన్న విద్యుత్‌ స్తంభం ఎక్కేశాడు.

తనకు రెండో పెళ్లి చేయాలని, పెళ్లికి ఒప్పుకుంటేనే దిగి వస్తానని పైనే ఉండిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే విద్యుత్‌శాఖ సిబ్బందికి ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వడంతో ఆ వీధిలో విద్యుత్‌ను నిలిపేశారు.

అప్పుడు ఊపిరి పీల్చుకున్న కుటుంబసభ్యులు సోర్బన్‌ను స్తంభంపై నుంచి దిగాలని ఎంతగా విజ్ఞప్తి చేసినా.. ఫలితం లేదు. దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి స్తంభం ఎక్కి.. అతడికి సర్ది చెప్పి కిందకి తీసుకొచ్చాడు. రెండ్రోజుల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.