ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (10:13 IST)

ఆలయంలోకి వెళ్లాడని చావకొట్టారు.. ఎక్కడ?

మంచినీరు తాగేందుకు ఆలయంలోకి ప్రవేశించాడన్న కారణంతో ముస్లిం బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసి చావకొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. 

ఆ వీడియోలో బాలుడిని ఒక వ్యక్తి ఏమాత్రం దయలేకుండా చితకబాదడం కనిపించింది. 'నీ పేరు ఏంటి.. నీ తండ్రి పేరు ఏంటి?' అని అడగ్గా ఆ బాలుడు చెప్పిన సమాధానంతో అతను ముస్లిం అని తెలుస్తోంది. ఆలయంలోకి ఎందుకు వచ్చావని ప్రశ్నించగా.. మంచి నీరు తాగేందుకు వచ్చానని ఆ బాలుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది.

ఆ తరువాత బాలుడిని కొట్టడం ప్రారంభించిన వ్యక్తి.. చేయి మెలితిప్పడంతో పాటు పలుమార్లు బాలుడి తలపై తన్నాడు. కింద పడినా కొట్టడం ఆపలేదు.

బాలుడిని కొట్టిన వ్యక్తిని బీహార్‌లోని భగల్‌పూర్‌ ప్రాంతానికి చెందిన శ్రింగి నందన్‌ యాదవ్‌గా గుర్తించి, అరెస్టు చేసినట్లు ఘజియాబాద్‌ పోలీసులు తెలిపారు. నిరుద్యోగి అయిన నిందితుడు మూడు నెలలుగా ఆలయంలోనే నివాసం ఉంటున్నాడని చెప్పారు.