3 నెలలకే కోటి రూపాయల అల్పాహారం ఆరగించిన 'అమ్మ' జయలలిత... ట్రీట్మెంట్‌కు ఎంతో?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మిస్టరీ డెత్ అంటూ ఇప్పటికే చాలా వాదనలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేస్తోంది ఓ కమిటీ. ఇందులో భాగంగా కమిటీ చేస్తున్న విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో సెప్టెంబరు 22, 2015న చేరారు. డిశెంబరు 5 న కన్నుమూశారు. ఐతే ఈమధ్య మూడు నెలల కాలంలో ఆమెకు అయిన ఖర్చు వివరాలను చూస్తే కళ్లు తిరుగుతాయి.
ఆమె ఉదయం పూట చేసే అల్పాహారానికి మూడు నెలలకు ఏకంగా రూ. 1,17,04,925 అయ్యాయట. ఇక ఆమె చికిత్సకు రూ. 6.85 కోట్లు ఖర్చయిందట. రిటైర్డ్ జడ్జ్ ఆర్ముగస్వామి ఆధ్వర్వలో కమిటీ విచారణ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అపోలో ఆసుపత్రికి సంబంధించి 150 మందిని విచారణ చేశారు. వారు చెప్పిన వివరాలన్నిటినీ నివేదికలో పొందుపరుస్తున్నారు.
చికిత్స జరిగిన సమయంలో జయలలిత వద్దకు వచ్చినవారు ఎవరూ, ఎవరెవరు ఎపుడెపుడు వచ్చి వెళ్లారన్న విషయాలతో పాటు ఖర్చు వివరాలను కూడా అడిగారు. దాంతో అపోలో అడ్మినిస్ట్రేషన్ విభాగం ఈ లెక్కలను కమిటీ చేతుల్లో పెట్టింది.