శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (14:41 IST)

కార్పొరేట్ శక్తులకు రైతులు బానిసలా? రాహుల్ గాంధీ

కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంటులో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు. రైతులను కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చాల‌ని కేంద్రం భావిస్తున్న‌దా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 
 
రైతు వ్య‌తిరేక వ్య‌వ‌సాయ బిల్లుల విష‌యంలో ప్ర‌భుత్వం ప్రయత్నాన్ని తాము సఫలం కానివ్వబోమని రాహుల్‌గాంధీ స్పష్టంచేశారు. ఈ మేరకు రాహుల్‌గాంధీ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. తాజాగా కేంద్ర ప్ర‌తిపాదిస్తున్న చ‌ట్టాల‌తో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు క‌న‌మ‌రుగ‌వుతాయ‌ని, వ్య‌వ‌సాయ మార్కెట్ల‌ను నాశనం చేసిన తర్వాత రైతులకు మద్దతు ధర ఎలా లభిస్తుందో చెప్పాలని ఆయన మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ మ‌ద్ద‌తు ధ‌ర ల‌భిస్తుంద‌ని భావిస్తే.. వ్యవసాయ బిల్లుల్లో దానికి సంబంధించి ఎందుకు గ్యారెంటీ ఇవ్వలేద‌ని రాహుల్ ప్రశ్నించారు.
 
మరోవైపు, రాజ్య‌స‌భ‌లో ఆదివారం తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. వ్య‌వ‌సాయ బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ విప‌క్ష స‌భ్య‌లు ఆందోళ‌న చేప‌ట్టారు. బిల్లుల‌ను ఆమోదింప చేసే ప్ర‌క్రియ‌ను.. విప‌క్ష స‌భ్యులు అడ్డుకున్నారు. అగ్రి బిల్లుల‌పై మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ మాట్లాడుతున్న స‌మ‌యంలో..  వివ‌ర‌ణ‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని డిప్యూటీ ఛైర్మ‌న్ హ‌రివ‌న్ష్ మంత్రిని కోరారు. 
 
అయితే స‌భ మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు స‌మాప్తం కావాల్సిన త‌రుణంలో.. బిల్లుల‌ను హ‌డావుడిగా పాస్ చేసేందుకు డిప్యూటీ ఛైర్మ‌న్ వాయిస్ ఓటుకు పిలిచారు. స‌వ‌ర‌ణ‌ల‌పై స‌భ్యుల వివ‌ర‌ణ తీసుకోకుండానే వాయిస్ ఓటుకు వెళ్లారు. ఆ సంద‌ర్భంలో విప‌క్ష నేత గులాం న‌బీ ఆజాద్ మాట్లాడుతూ.. స‌భ స‌మ‌యాన్ని ఏకాభిప్రాయం ద్వారా పొడిగిస్తార‌ని, కానీ సంఖ్య ఆధారంగా పొడిగించార‌న్నారు. స‌భ్యుల ఏకాభిప్రాయం ప్ర‌కారం స‌భ‌ను రేప‌టికి వాయిదా వేయాల‌ని కోరారు.
 
కానీ డిప్యూటీ ఛైర్మ‌న్ బిల్లుల‌ను ఆమోదింప చేసేందుకు వాయిస్ ఓటుకు మొగ్గుచూపారు. ఆ ద‌శ‌లో టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ .. డిప్యూటీ ఛైర్మ‌న్ చైర్ వైపు దూసుకువెళ్లారు. త‌న చేతిలో ఉన్న రూల్ బుక్‌ను చైర్ వైపు చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ఏక‌ప‌క్షంగా వాయిస్ ఓటు నిర్వ‌హించ‌రాదు అని అడ్డుకున్నారు. డిప్యూటీ ఛైర్మ‌న్ డెస్క్ వైపు కొంద‌రు ఎంపీలు దూసుకువెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. వారిని మార్ష‌ల్స్ అడ్డుకున్నారు. 
 
డిప్యూటీ ఛైర్మ‌న్ డెస్క్‌పై ఉన్న మైక్‌ల‌ను కూడా కొంద‌రు ఎంపీలు లాగేసే ప్ర‌య‌త్నం చేశారు. వారి చేతుల్ని మార్ష‌ల్స్ డెస్క్ మీద నుంచి తొల‌గించారు.  విప‌క్ష స‌భ్యులు బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ నినాదాలు చేశారు. కొంత స‌మ‌యం మైక్‌ను ఆపేసి కూడా స‌భ నిర్వ‌హించారు. స‌భ్యుల నినాదాల మ‌ధ్య‌నే డిప్యూటీ ఛైర్మ‌న్ ప‌లు విష‌యాల‌ను మాట్లాడారు. తీవ్ర గంద‌ర‌గోళం మ‌ధ్య స‌భ‌ను మ‌ధ్యాహ్నం 1.41 నిమిషాల వ‌ర‌కు వాయిదా వేశారు.
 
వాయిదా త‌ర్వాత స‌మావేశ‌మైన రాజ్య‌స‌భ‌లో మ‌ళ్లీ నిర‌స‌న‌లు హోరెత్తాయి. అయినా డిప్యూటీ ఛైర్మ‌న్ వాయిస్ ఓటు ద్వారా మూడు అగ్రి బిల్లుల‌ను పాస్ చేశారు. పంట‌కు ఎంఎస్‌పీ కొన‌సాగుతుంద‌ని మంత్రి తోమ‌ర్ స్ప‌ష్టం చేశారు. మూడు బిల్లులు ఇప్ప‌టికే లోక్‌స‌భ‌లో పాస‌య్యాయి.