మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (06:57 IST)

కేంద్రంలో చిచ్చుపెట్టిన వ్యవసాయ బిల్లు.. మంత్రిపదవికి కౌర్ రాజీనామా

ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో వ్యవసాయ సంబంధిత బిల్లు చిచ్చురేపింది. ఈ బిల్లును కేంద్రం గురువార పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అయితే, ఈ బిల్లుల్లో పలు అంశాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని, వ్యవసాయ రంగాన్ని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసేలా ఉన్నాయని కూటమిలో భాగస్వామి అయిన శిరోమణి అకాళీదళ్ అభిప్రాయపడింది. 
 
అంతేకాదు బిల్లును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సభ్యురాలు హర్ సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభలో ఈ బిల్లులు ఓటింగ్‌కు వెళ్లే ముందు ఆమె రాజీనామా చేశారు. ప్రధాని కార్యాలయంలో తన రాజీనామాను అందించారు. 
 
ఈ సందర్భంగా ఆమె భర్త, పార్టీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి తాము వెలుపలి నుంచి మద్దతును ఇస్తామని... ఇదే సమయంలో రైతుల వ్యతిరేక విధానాలను మాత్రం తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. 
 
కాగా, అకాలీదళ్‌ నుంచి ఆమె ఒక్కరే కేంద్ర మంత్రివర్గంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రిగా ఉన్నారు. అకాలీదళ్‌ పార్టీ సుదీర్ఘకాలం నుంచి బీజేపీ మిత్రపక్షంగా ఉన్నది. ఎన్డీఏలో కొససాగడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సుఖ్‌బీర్‌సింగ్‌ మీడియాకు తెలిపారు.
 
మరోవైపు, ప్రతిపక్షాల ఆందోళనల నడుమ రెండు బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ‘ది ఫార్మర్స్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌)’ బిల్లు, ‘ది ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అష్యూరెన్స్‌ అండ్‌ ఫామ్‌ సర్వీసెస్‌' బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించింది. కాంగ్రెస్‌, డీఎంకే పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.
 
కేంద్రం తెచ్చిన ఆ మూడు బిల్లులివే.. 
* రైతులు తమ ఉత్పత్తులను స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లోనే కాకుండా దేశంలో ఎక్కడైనా విక్రయించేందుకు వీలు కల్పించే ‘ది ఫార్మర్స్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌)’ బిల్లు.
 
* పంటకు ముందే వ్యాపారులతో రైతులు చేసుకునే ఒప్పందాలకు రక్షణ కల్పించే ‘ది ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అష్యూరెన్స్‌ అండ్‌ ఫామ్‌ సర్వీసెస్‌' బిల్లు.
 
* అసాధారణ పరిస్థితుల్లో ఆహార ఉత్పత్తుల సరఫరాను నియంత్రించేందుకు తీసుకొచ్చిన ఎసెన్సియల్‌ కమాడిటీస్‌ (అమెండ్‌మెంట్‌) బిల్లు.