శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (16:26 IST)

సీఎం కేసీఆర్‌కి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖ

గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, నమస్కారములు, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలు ఉన్నాయి. అలాగే తెలంగాణ విమోచన పోరాటం దేశ చరిత్రలోనే ప్రత్యేకమైనది. అత్యంత ముఖ్య ఘట్టము. 1947 ఆగస్ట్ 15న దేశమంతా స్వేచ్ఛావాయువులు పీల్చినప్పటికీ నాటి నిజాం పాలనలో హైద్రాబాదు సంస్థానం ప్రస్తుత.. తెలంగాణలో మాత్రం నాడు మువ్వన్నెల జెండా ఎగరలేదని మీకు తెలుసు. 
 
తెలంగాణ ప్రజలను అనేక కష్టనష్టాలకు గురిచేసిన నిజాంను గద్దె దింపి, హైదరాబాద్ సంస్థానానికి విమోచనం కల్పించటంలో ఎంతోమంది మహానాయకుల పాత్ర ఉంది. తెలంగాణ విమోచన పోరాటంలో, రజాకార్ల అకృత్యాలను ఎదుర్కొని తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసిన వారిలో కొమురం భీం, పీవీ నరసింహారావు, రామానంద తీర్థ, మర్రి చెన్నారెడ్డి, వందేమాతరం రామచంద్రరావు, నారాయణరావు పవార్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ వంటి వేలాది మంది ప్రజలు పోషించిన ఉద్యమ పోరాట నాయకులు పాత్ర చిరస్మరణీయం. 
 
వీరందరి కృషి, అమరుల ప్రాణత్యాగాల కారణంగానే తెలంగాణ దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేపట్టిన పోలీసు చర్య, తెలంగాణ ప్రాంతానికి 1948 సెప్టెంబర్ 17న నిజమైన స్వాతంత్రం తెచ్చి పెట్టిందన్న విషయం జగద్విదితమే. ఇంతటి విశిష్ట, సాహసోపేత చరిత్ర ఉన్న ‘తెలంగాణ విమోచన పోరాటం’ గురించి ప్రస్తుత, భావితరాలు తెలుసుకుని స్ఫూర్తి పొందాల్సిన అవసరముంది.
 
దీనికోసం పూర్తిస్థాయిలో స్వాతంత్ర సమరయోధుల చరిత్రతో కూడిన ప్రత్యేక స్మారక స్ఫూర్తి కేంద్రం ఉండాలనేది.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష. దీనికి అనుగుణంగానే.. ఇటీవల నేను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గారిని కలిసి ఈ అంశం గురించి ప్రస్తావించినపుడు, తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుకు వారు సానుకూలంగా స్పందించి, కేంద్ర ప్రభుత్వం నుండి స్పూర్తి కేంద్రం నిర్మాణానికి కావలసిన నిధులు అందిస్తామని చెప్పారు.
 
తెలంగాణ విమోచన పోరాట ఉద్యమం గురించి పూర్తి అవగాహన ఉన్న మీరు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతున్నాను. ఈ మ్యూజియం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన భూమిని కేటాయించాల్సిందిగా మనవి చేస్తున్నాను. హైదరాబాద్‌లో తెలంగాణ విమోచన అమరవీరుల ఉద్యమ స్పూర్తి కేంద్రానికి భూమి కేటాయిస్తే, ఒక అద్భుతమైన, ప్రేరణాత్మకమైన ‘తెలంగాణ విమోచన పోరాట స్ఫూర్తి కేంద్రం’ భావితరాలకు  ఉపయోగపడే విధంగా ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
 
ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు, తెలంగాణా ప్రాంతంలో నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాట చరిత్ర తెలిసిన ప్రముఖ వ్యక్తీగా ఈ స్మారక స్పూర్తి కేంద్రం ఏర్పాటుకు కావలసిన స్థలాన్ని వెంటనే కేటాయించి, నిర్మాణానికి వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తున్నాను. కృతజ్ఞతలతో, ఇట్లు, భవదీయ- (జి. కిషన్ రెడ్డి), హోం శాఖ సహాయ మంత్రి.