మంగళవారం, 29 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 మే 2016 (13:33 IST)

తమిళనాడులో జయలలితదే అధికారం.. స్థానిక మీడియా సర్వేల్లో వెల్లడి

తమిళనాడు రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే, ఈ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాల్లో అన్నాడీఎంకే అధికారం కోల్పోయి, డీఎంకే పవర్‌లోకి వస్తుందని వెల్లడించాయి. ఇవి అన్నాడీఎంకే శ్రేణులను నిరుత్సాహానికి గురి చేయగా, డీఎంకే శ్రేణులు ఆనందోత్సంలో ముంచెత్తాయి. 
 
నిజానికి ఎగ్జిట్‌పోల్స్‌లో అధికశాతం అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా, డీఎంకేకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. అన్నాడీఎంకే అధికారానికి దూరమవుతుందని 4 ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించగా, కాదు కాదు మళ్లీ ఆ పార్టీనే అధికారంలో వుంటుందని ఒకే ఒక సంస్థ వెల్లడించిన ఎగ్జిట్‌పోల్‌ స్పష్టం చేసింది. 
 
అయితే, తమిళ మీడియా మాత్రం అన్నాడీఎంకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నట్టు పేర్కొన్నాయి. ఈ ఫలితాలపై జూనియర్ వికటన్, తంతి టీవీ, దినమలర్, న్యూస్ 7, పుదియ తలైమురై, మక్కల్ ఆయువు కళగం, కుముదమ్ రిపోర్టర్ వంటి సంస్థలు నిర్వహించిన సర్వేలో అన్నాడీఎంకే విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి.
 
ఇటు జాతీయ, అటు స్థానిక మీడియా వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాల్లో సగటున లెక్కిస్తే జయలలితకు 107 సీట్లు, డీఎంకే కూటమికి 99 చొప్పున వస్తాయినీ, చిన్నాచితక పార్టీలు అత్యంత కీలకంగా మారుతాయని పేర్కొన్నాయి.