శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 ఆగస్టు 2021 (10:37 IST)

మసూద్ అజర్ మేనల్లుడు లంబూ కాల్చివేత

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా దాడి కేసులో ప్రధాన సూత్రధారి, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ మేనల్లుడు, కరడుగట్టిన ఉగ్రవాది మహ్మద్ ఇస్లామ్ అలియాస్ అబూ సైఫుల్లా, అలియాస్ లంబూను శనివారం భద్రతా దళాలు హతమార్చాయి. 
 
అతడి కోసం రెండేళ్లుగా గాలిస్తున్న బలగాలు ఎట్టకేలకు శనివారం దాచీగామ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లంబూను మట్టుబెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మరో ఉగ్రవాదిని కూడా భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. 
 
2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడి కేసులో లంబూ ప్రధాన కుట్రదారుడు. అప్పటి నుంచి అతడి కోసం గాలిస్తున్న బలగాలు నిన్న విజయం సాధించాయి. 
 
ఇదే ఎన్‌కౌంటర్‌లో మరణించిన మరో ఉగ్రవాది సమీర్ దార్ కూడా పుల్వామా కేసులో నిందితుడే కావడం గమనార్హం. కాగా, పుల్వామా నిందితుల్లో ఇప్పటి వరకు 9 మందిని భద్రతా దళాలు హతమార్చాయి.