నోబెల్ గ్రహీతలకు భారత్‌లో బోధన కష్టసాధ్యమేనట..
భారతీయ విద్యా సంస్థల్లో బోధన చేసేందుకు నోబెల్ గ్రహీతలకు తగిన మౌలిక వసతులు భారత్‌లో లేనేలేవని ప్రముఖ నోబెల్ గ్రహీత వెంకటరామన్ రామకృష్ణన్ ఆవేదన వ్యక్తి చేశారు. భారత్‌తో పోలిస్తే చైనా బీజింగ్, షాంగై వంటి నగరాల్లో మౌలిక వసతుల విషయంలో అద్భుతమైన మెరుగుదల స
భారతీయ విద్యా సంస్థల్లో బోధన చేసేందుకు నోబెల్ గ్రహీతలకు తగిన మౌలిక వసతులు భారత్‌లో లేనేలేవని ప్రముఖ నోబెల్ గ్రహీత వెంకటరామన్ రామకృష్ణన్ ఆవేదన వ్యక్తి చేశారు. భారత్‌తో పోలిస్తే చైనా బీజింగ్, షాంగై వంటి నగరాల్లో మౌలిక వసతుల విషయంలో అద్భుతమైన మెరుగుదల సాధించిందని, భారత్‌లో అలాంటి మౌలిక వసతులు లేనే లేవని రామకృష్ణన్ పేర్కొన్నారు. ఎవరైనా ప్రముఖ విజిటింగ్ ప్రొఫెసర్ భారత్ వచ్చారంటే అతడు లేదా ఆమె కొన్ని వారాలు లేక నెలలపాటు భారత్‌లో ఉండవలసి వస్తుందని వారికి మౌలిక వసతుల మెరుగుదల తప్పనిసరి ఆవశ్యకమని స్పష్టం ఛేశారు.
వైబ్రాంట్ గుజరాత్‌లో భాగంగా వడోదరలో గురువారం మీడియాతో మాట్లాడిన రామకృష్ణన్ ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ భారత్‌కు మేధో వలస సాధ్యమేనని చెప్పారు. గత 50 ఏళ్లుగా అగ్రశ్రేణి భారత పరిశోధకులు వలస వెళ్లిపోయారని, కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వారు మళ్లీ బారత్‌కు తిరిగి వస్తుండటం మంచి సంకేతం అని వెంకట్రామన్ అన్నారు. తాను భారత్‌లో చదివేటప్పుడు లేని ప్రథమ శ్రేణి విద్యా సంస్థలు భారత్‌లో ఇప్పుడున్నాయని తెలిపారు.
ప్రభుత్వం ఒకవైపు సైన్స్ రంగంలో పెట్టుబడులు పెడుతూనే అదే సమయంలో ఆర్థిక వృద్ధివైపు దృష్టి సారించాలని, ఆర్థిక వ్యవస్థ పెరిగే క్రమంలో మరిన్ని నిధులను సైన్స్ రంగానికి కేటాయించవచ్చని రామకృష్ణన్ తెలిపారు. మంచి పరిశోధనా ఫలితాలు రావాలంటే మంచి పరిశోధనా సౌకర్యాలు ఉండాలని, కానీ ఇదంతా ఒక్క రాత్రిలో జరిగేవి కావని దీనికి ఒకటి రెండు తరాలు పడుతుందని ఆయన అన్నారు.
ప్రస్తుతం ఎంఎస్ యూనివర్శిటీ అల్యూమినస్ గా ఉన్న రామకృష్ణన్ 2009లో రసాయనశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు.