శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (10:35 IST)

దేశంలో రాహుల్ శకం మొదలైంది : ఉద్ధవ్ ఠాక్రే

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ మిత్రపక్షమైన శివసేన ఉద్ధవ్ ఠాక్రే తనదైనశైలిలో స్పందించారు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. ఫలితంగా బీజేపీ

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ మిత్రపక్షమైన శివసేన ఉద్ధవ్ ఠాక్రే తనదైనశైలిలో స్పందించారు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. ఫలితంగా బీజేపీ నేతలకు ముచ్చెమటలు పోశాయి. 
 
ఈ ఫలితాల సరళిపై శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. దేశంలో రాహుల్ శకం మొదలైందన్నారు. గుజరాత్‌లో ఫలితం ఎలా ఉన్నా కాంగ్రెస్ బాధ్యతలు మోయడంలో రాహుల్ పరిపూర్ణత సాధించారన్నారు. కాంగ్రెస్ భారం మొత్తం ఇప్పుడు రాహుల్ భుజస్కందాలపై ఉందని, బీజేపీకి ఎదురొడ్డి నిలబడగల నేత కూడా రాహుల్ గాంధీయేనని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
అదేసమయంలో రాహుల్ గాంధీని ఇకపై ఏ ఒక్కరూ తక్కువ అంచనా వేయకూడదని ఉద్ధవ్ చెప్పారు. గుజరాత్‌లో కాకలు తీరిన రాజకీయ నేతలు ఉన్నప్పటికీ యుద్ధభూమిలో రాహుల్ గాంధీ ఎదురొడ్డి నిలబడ్డారని, ఈ విశ్వాసమే ఆయనను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ముందుకు నడిపిస్తుందన్నారు. ఇకపై అధికార పార్టీ నేతలు రాహుల్ గాంధీని విమర్శించడం మాని ప్రజాసమస్యలపై దృష్టిపెడితే మంచిదని ఉద్ధవ్ ఠాక్రే హితవు పలికారు.