ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 17 జులై 2017 (14:06 IST)

పెళ్లికాకుండానే పిల్లలకు పేరు పెట్టినట్లుంది?: ఉపరాష్ట్రపతి పదవిపై వెంకయ్య విముఖత

తాను ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నట్టు వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. తాను ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నట్టు వచ్చిన వార్తలపై ఆయన మాట్లాడుతూ తన పేరును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ

తాను ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నట్టు వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. తాను ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నట్టు వచ్చిన వార్తలపై ఆయన మాట్లాడుతూ తన పేరును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించనుందనే వార్త పెళ్లి కాకుండానే పిల్లలకు పేరు పెట్టినట్లుంది అని అన్నారు. అంటే తనకు ఉపరాష్ట్రపతి పదవిపై ఏమాత్రం మక్కువ లేదని ఆయన తేల్చిచెప్పారు. 
 
కేంద్ర కేబినెట్‌లో సీనియర్ మంత్రిగా ఉన్న ఎం.వెంకయ్య నాయుడుకు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టేందుకు ఇప్పటికే కేంద్రం సిద్ధమైనట్టు వార్తలు రావడంతో ఆయన సోమవారం స్పందించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ కోసం పార్లమెంటుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఈ విషయంలో ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదు. మరి కొందరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. రాష్టపతి ఎన్నికలు పూర్తయిన తర్వాత బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటారు..’’ అని ఆయన వెల్లడించారు.
 
రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి రాంనాథ్ కోవింద్ విజయం లాంఛనమే కావడంతో.. ఉపరాష్ట్రపతి పదవి కోసం దక్షిణాది నేతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. దీంతో వెంకయ్య నాయుడుకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తే బాగుంటుందంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్వయంగా ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే ఆయన ముందే ఈ పదవికి వెంకయ్య విముఖత వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. 
 
తాను క్రియాశీల రాజకీయాల్లోనే ఉండాలనుకుంటున్నాననీ... ఎన్డీయే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే తన లక్ష్యమని వెంకయ్య చెప్పినట్టు తెలుస్తోంది. తన బదులు ఉపరాష్ట్రపతి పదవికి మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌ రావు అయితే బాగుంటుందని కూడా వెంకయ్య సూచించినట్టు సమాచారం. తమిళనాడు ఎంపీ ఎల్ గణేశన్, కేరళ సీనియర్ నేత రాజగోపాల్, మాజీకేంద్ర మంత్రి రాంనాయక్‌ తదితరుల పేర్లను కూడా వెంకయ్యనాయుడు సూచించినట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు.. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాజ్యసభలో కాంగ్రెస్ విపక్ష నేత గులాం నబీ ఆజాద్ వంటి, జేడీయు అధినేత శరద్ యాదవ్ వంటి అతిరథ మహారథులు ముందస్తు అభినందనలు తెలపడం గమనార్హం. దీంతో ఉపరాష్ట్రపతి రేసులో వెంకయ్య పేరు మొదటి స్థానంలో ఉందనే విషయం చెప్పకనే చెపుతుంది.