శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (07:19 IST)

ఉత్తరప్రదేశ్‌లో కమలానికి చిక్కులు - మరో మంత్రి రాంరాం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి కష్టాలు ఎక్కువ అవుతున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే బీజేపీకి చెందిన ముగ్గురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తాజాగా మరో మహిళా మంత్రి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. దీనికి కారణం భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలేనని చెప్పుకుంటున్నారు. 
 
అదేసమయంలో ఈమె బీజేపీకి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరవొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి మరింతగా ఊతమిచ్చేలా లక్నో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కానీ సరోజినీ నగర్ నియోజకవర్గం అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.
 
బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి స్వాతి సింగ్‌కు ఈ నియోజకవర్గంలో కమలనాథులు సీటు నిరాకరించారు. బీజేపీ నిర్ణయంపై మంత్రి స్వాతి సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, తన భార్యపై పోటీకి దిగే అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేస్తానని స్వాతి సింగ్ భర్త దయాశంకర్‌ సింగ్ ప్రకటించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. భార్యాభర్తల మధ్య ఉన్న కుటుంబ కలహాలు బాహ్య ప్రపంచానికి తెలిశాయి. అయితే, ఆమె భర్త ప్రకటనపై స్వాతి సింగ్ పార్టీ ఇంకా స్పందించలేదు. 
 
ఇప్పటికే స్వాతి సింగ్, ఆమె భర్త దయాశంకర్‌ సింగ్‌ల మధ్య విభేదాలు నెలకొనగా, ఇప్పుడు టిక్కెట్టు రాకపోవడంతో కుటుంబం కష్టాల్లో పడింది. అలాగే, స్వాతి సింగ్‌కు సీటును తిరిగి ఇవ్వకూడదని ఆమె భర్త దయాశంకర్ సింగ్ బీజేపీ నాయకత్వానికి పావులు కదుపుతున్నారు. అందుకే తన సతీమణిపై పోటీకి దిగిన అభ్యర్థి గెలుపు కోసం పాటుపడతానని దయాశంకర్ సింగ్ ప్రకటించడం గమనార్హం. 
 
సీటు ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్న స్వాతి సింగ్‌కు సమాజ్ వాదీ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే 3 మంది బీజేపీ మంత్రులు, 10 మందికి పైగా ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ సహా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం మరో మంత్రి బీజేపీని వీడనున్నారనే వార్తలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.