ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 6 మార్చి 2017 (07:26 IST)

మావాళ్లకు ఒక్క సీటూ ఇవ్వరా.. తేల్చుకుంటామంటున్న ముస్లింలు: కాశీలో కమలం కొంప మునిగేనా?

యూపీలో బీజేపీ ఎంత మంది ముస్లింలకు సీట్లిచ్చింది? ఒక్కరికి కూడా ఇవ్వలేదు.. మేం ఎందుకు బీజేపీకి ఓటేయ్యాలి అంటూ ముస్లింలు ప్రశ్నిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వారణాసిలో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దీంతో మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు నెలకొంది.  2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభంజనంతో పాటు ముస్లిం ఓట్లు కూడా బీజేపీకి బాగా కలిసొచ్చాయి. ఈ సారి బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ–కాంగ్రెస్‌లు ఏకమవడం, పట్టున్న నేతలకు మిగతా పార్టీలు సీట్లివ్వగా... అభ్యర్థుల ఎంపికలో తడబడడం బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశముంది.  

 
ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే వారణాసిలో బహిరంగ ర్యాలీల్లో ప్రసంగించడంతో పాటు పలు రోడ్‌షోలు నిర్వహించారు. పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతల్ని వారణాసిలో ప్రచారం కోసం మోహరించారు.  2012 అసెంబ్లీ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గంలోని ఐదు అసెంబ్లీ సీట్లకుగాను బీజేపీ మూడింటిని గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ముగ్గురు సిట్టింగ్‌ల్లో ఇద్దరు అభ్యర్థుల్ని మార్చింది.వారణాసి సౌత్‌ స్థానం నుంచి ఏడు సార్లు విజేతగా ఉన్న శ్యామ్‌దేవ్‌ రాయ్‌ చౌదరీ స్థానంలో నీలకంఠ తివారీకి అవకాశమిచ్చింది.
 
ఇక వారణాసి కంటోన్మెంట్‌ నుంచి జోత్సానా శ్రీవాత్సవకు బదులు ఆమె కుమారుడు సౌరభ్‌ శ్రీవాత్సవ పోటీ చేయనున్నారు. ఈ మార్పులు పార్టీలో కొందరు నేతలకు రుచించలేదు. కాగా వారణాసి నార్త్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే రవీంద్ర జైశ్వాల్‌కే అవకాశమిచ్చింది. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో జైశ్వాల్‌ గట్టెక్కారు. నియోజక వర్గంలోని ముస్లింలు ఈసారి ఎస్సీ – కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీచేయడం కలిసొచ్చే అంశం. రోహనియా నుంచి బీజేపీ, మిత్రపక్షం అప్నా దళ్‌ల మధ్య పొత్తు కుదరకపోవడంతో విడి విడిగా పోటీ చేయడం మరో ఎదురుదెబ్బ.  
 
‘ఎందుకు ఓటేయాలి’
వారణాసి నియోజకవర్గంలో దాదాపు 20 శాతం ముస్లిం జనాభా ఉన్నారు. ఈసారి వారంతా బహిరంగంగా ఎస్పీ–కాంగ్రెస్‌ కూటమికే ఓటేయవచ్చని అంచనా వేస్తున్నారు. నిజానికి 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింల్లో చీలిక బీజేపీ మూడు సీట్లు గెల్చేందుకు సాయపడింది. మోదీ రోడ్‌ షోల్లో ముస్లింలు కనిపించినా అవన్నీ ఓట్లుగా మారకపోవచ్చని అంచనా వేస్తున్నారు. యూపీలో బీజేపీ ఎంత మంది ముస్లింలకు సీట్లిచ్చింది? ఒక్కరికి కూడా ఇవ్వలేదు.. మేం ఎందుకు బీజేపీకి ఓటేయ్యాలి అంటూ ముస్లింలు ప్రశ్నిస్తున్నారు.