మమ్మీ... నా తండ్రి ఎవరు? 27 ఏళ్ల కిందటి అత్యాచారంపై ఇపుడు ఆరా...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఓ విచిత్ర కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. 27 యేళ్ల కిందట జరిగిన ఓ అత్యాచారం కేసులోని పూర్తి వివరాలను వెలికి తీయాలని కోర్టు ఆదేశించింది. దీనికంతటికి కారణం.. అత్యాచార బాధితురాలికి జన్మించిన కుమారుడు... తన తండ్రి ఎవరు అని తల్లిని అడిగాడు. ఆమె కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ కేసులో వాస్తవాలు వెలికి తీయాల్సిందిగా స్థానిక పోలీసులను ఆదేశించింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని షాజహాన్‌పుర్ జిల్లాలోని సదర్ పోలీసుస్టేషన్ పరిధిలో 1994లో ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగించేవారు. వారి బంధువులకు చెందిన 12 ఏళ్ల బాలిక వీరివద్దనే ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఓ యువకుడు అత్యాచారం చేశాడు. కొన్నిరోజుల తర్వాత మరొక యువకుడు కూడా అత్యాచారం చేశాడు.
కొంతకాలానికి ఆ బాలిక కుమారుడికి జన్మనిచ్చింది. ఆ బాలుడిని ఇతర బంధువులకు అప్పగించి, బాధితురాలికి మరో పెళ్లి చేశారు. ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తికి విషయం తెలియడంతో భార్యను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. కాలచక్రం గిర్రున తిరిగింది. ఆమెకు జన్మించిన కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు.
పెంచుకుంటున్న తల్లిదండ్రులు అతనికి వాస్తవాలు వెల్లడించారు. దీంతో అతను తల్లి దగ్గరకు వెళ్లగా ఆమె మొత్తం ఉదంతం వివరించారు. కుమారుడికి అతని తండ్రి ఎవరో తెలియజెప్పేందుకు వివరాలు వెలికితీయాలంటూ న్యాయస్థానాన్ని, పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు డీఎన్‌ఏ పరీక్షలు చేస్తామని పోలీసులు చెప్పారు.