మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (13:22 IST)

పెళ్లి విందు భోజనంలో బీఫ్ వడ్డించలేదనీ...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటనొకటి చోటుచేసుకుంది. విందు భోజనంలో వరుడు కుటుంబీకులు బీఫ్ వడ్డించమన్నారనీ వధువు తరపువారు పెళ్లిని రద్దు చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంబాల్ జిల్లా సిసౌటా గ్రామానికి చెందిన అస్ఘర్ అలీ తన కుమార్తెను నసీం అలీ కుమారుడు నాజిమ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. తన కుమార్తెకు నిశ్చితార్ధం చేసి వధువు, వరుడు ఉంగరాలు కూడా మార్చుకున్నారు. వీరి వివాహం ఈనెల 25వ తేదీన జరగాల్సివుంది. 
 
అయితే, పెళ్లి విందు భోజనంలో బీఫ్‌ వడ్డించాలనీ, కట్నం కింద రూ.5 లక్షల నగదు, కారుతో పాటు బంగారు వస్తువులు ఇవ్వాలని వరుడు తరపువారు డిమాండ్ చేశారు. అయితే, వీరి కోర్కెలు తీర్చేందుకు సమ్మతించిన వధువు తండ్రి.. విందు భోజనంలో మాత్రం బీఫ్ వడ్డించలేనని తెగేసి చెప్పాడు. దీంతో వరుడు కుటుంబ సభ్యులు గొడవపడి పెళ్ళి రద్దు చేసుకున్నారు. 
 
దీంతో వధువు తండ్రి అస్ఘర్ అలీ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసు అధికారి అజయ్ పాల్ దర్యాప్తు ప్రారంభించారు. కాగా, పెళ్లి చివరి క్షణంలో మరో సంబంధం కుదుర్చుకునేందుకే వధువు తరపువారు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వరుడి కుటుంబీకులు ప్రత్యారోపణలు చేస్తున్నారు.