శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (16:19 IST)

రక్షణ లేదన్నవారిపై బాంబులేస్తాం : బీజేపీ ఎమ్మెల్యే

ఒకవైపు దేశంలో ఉంటూనే మరోవైపు దేశాన్ని విమర్శిస్తూ, దేశంలో రక్షణ లేదనే వారిపై బాంబు లేస్తామని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే విక్రమ్ శైనీ హెచ్చరించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దేశంలో ఉంటూ దేశంపై విమర్శలు గుప్పించేవారు దేశ ద్రోహులకిందకే వస్తారన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గోరక్ష పేరుతో ఇటీవల జరిగిన సంఘటనలు తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెల్సిందే. దీంతో భారత్‌లో రక్షణలేకుండా పోతోందంటూ కొందరు చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. 
 
ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారందరూ దేశ ద్రోహులేనని అన్నారు. చట్టం ప్రకారం వీళ్లందరినీ కఠినంగా శిక్షించాలన్నారు. భారత్‌లో ఉండటం రక్షణాత్మకం కాదు అంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేసేవారిపై బాంబులు వేయాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. భారతీయ విలువలను గౌరవించని వాళ్లు.. ఈ దేశం విడిచి విదేశాలకు వెళ్లడాన్ని మేం స్వాగతిస్తామన్నారు. 
 
ఇందుకోసం ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే భారత్‌లో ఉంటూ అభద్రతకు లోనవుతున్నవారిపై బాంబులేసే బాధ్యతను తాను తీసుకుంటానని ఎమ్మెల్యే విక్రమ్ శైనీ చెప్పడం ఇక్కడ కొసమెరుపు. పైగా, తాను ఎవరికీ భయపడనని.. దేశం కోసమే ఇలా మాట్లాడానని చెప్పారు. కాగా, ఈయన గతంలో హిందువులు సాధ్యమైనంతమేరకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.