మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వాసుదేవన్
Last Updated : బుధవారం, 22 మే 2019 (15:28 IST)

హిమాలయన్ వయాగ్రా కోసం రెండు గ్రామాల మధ్య డిష్యూం డిష్యూం..

హిమాలయన్ వయాగ్రా.. కీడా జాడీ, యర్సగుంబా అని పిలువబడే ఈ కాటర్ పిల్లర్ ఫంగస్ హిమాలయ పర్వత సానువుల్లో మాత్రమే లభిస్తుంది. గొంగళి పురుగుకు నేలలో ఉండే ఫంగస్ సోకి, అది చనిపోయాక యర్సగుంబాగా మారుతుంది. ఇది సముద్ర మట్టానికి దాదాపు పది వేల అడుగుల ఎత్తులో పెరుగుతుంది. ఇది భారతదేశంతోపాటు నేపాల్, టిబెట్, భూటాన్‌లలోని హిమాలయ ప్రాంతాల్లో లభ్యం అయ్యే అరుదైన సహజ ఔషధం. 
 
ఈ హిమాలయన్ వయాగ్రా వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని తేనీరుగా, సూపులలో కలిపి తాగుతుంటారు. అంగస్తంభన సమస్యలు, డయాబెటిస్, దగ్గు, జలుబు, కామెర్లు, ఆస్తమా, క్యాన్సర్‌ ఇలా రకరకాల జబ్బులను ఈ ఫంగస్ తగ్గిస్తుందని ప్రజల విశ్వాసం. 
 
ఇలా అన్ని రకాల సమస్యలు పరిష్కరించబడుతాయని విశ్వసించబడుతూండడంతో అంతర్జాతీయంగా దీనికి భారీ డిమాండ్ ఏర్పడి... కిలో రూ.70 లక్షల వరకు పలుకుతోందంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అటువంటి ఈ ఔషధాన్ని సేకరించేందుకు పరిసర ప్రాంతాలలోని ప్రజలు మే, జూన్ నెలల్లో పర్వతాలపైకి వెళ్తూండడం సహజంగా జరిగేదే.
 
కాగా... ఈ హిమాలయన్ వయాగ్రా ఉత్తరాఖండ్‌లో పిత్రోగఢ్ జిల్లాలోని బుయ్, పటో అనే రెండు గ్రామాల మధ్య ఒక తాజా వివాదానికి కారణంగా నిలిచింది. తమ రెండు గ్రామాల మధ్య ఉన్న కొండలపై పెరిగే ఈ ఫంగస్‌ తమదంటే తమదేనని ఇరు గ్రామాల ప్రజలు గత రెండేళ్లుగా గొడవలకు దిగుతూనే ఉన్నారు.
 
విబేధాలను పరిష్కరించుకోవాలని జిల్లా యంత్రాంగం సూచించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో లాభం లేదనుకున్న జిల్లా యంత్రాంగం.. గొడవలను అరికట్టడం కోసం ఆ ప్రాంతంలో 145వ సెక్షన్‌ను విధించింది. అయితే వాతావరణంలోని మార్పుల కారణంగా, ప్రపంచంలోని అత్యంత విలువైన జీవ పదార్థాల్లో ఒకటిగా పేరొందిన ఈ హిమాలయన్ వయాగ్రా లభ్యత కూడా క్రమంగా తగ్గుతోంది.