శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 10 జనవరి 2019 (15:49 IST)

రంజీ ట్రోఫీలో సరికొత్త రికార్డ్.. 68 వికెట్లతో అశుతోష్ అదుర్స్

రంజీ ట్రోఫీలో యువ క్రికెటర్లు తమ సత్తా చాటుకుంటున్నారు. తాజాగా బీహార్ జట్టు కెప్టెన్, యువ స్పిన్నర్ అశుతోష్ అమన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో సగత్‌పమ్ సింగ్‌ను ఎల్బీగా అవుట్ చేసిన అశుతోష్ రంజీల్లో సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రంజీ ట్రోఫీలో ఇప్పటివరకు 68 వికెట్లు తీసిన 32 ఏళ్ల అశుతోష్ 44 ఏళ్ల పాటు పదిలంగా వున్న బిషన్ సింగ్ బేడీ రికార్డును అధిగమించాడు. 
 
1974-75 సీజన్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ 64 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. ఈ రికార్డును అశుతోష్ బ్రేక్ చేశాడు. ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి అయిన అమన్ రెండో ఇన్నింగ్స్‌లో 71 పరుగులు ఇచ్చి.. ఏడు వికెట్లు పడగొట్టాడు. మొత్తం 14 ఇన్నింగ్స్‌ల్లో 6.48 సగటుతో 68 వికెట్లు పడగొట్డాడు. ఈ సందర్భంగా అశుతోష్ మాట్లాడుతూ.. ఈ రికార్డును అధిగమించడం ద్వారా హర్షం వ్యక్తం చేశాడు.
 
బిషన్ సింగ్ బేడీ రికార్డును బ్రేక్ చేయటం ఎంతో గర్వంగా వుందని అశుతోష్ చెప్పుకొచ్చాడు. తాను ఫార్మల్ క్రికెటర్‌ని కాదని.. ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం చేసేందుకు ముందు ఢిల్లీ, బీహార్‌లో కోచింగ్ తీసుకున్నానని.. బీహార్ కోచ్ విలువైన సలహాలు ఇచ్చారని చెప్పుకొచ్చాడు. కోచ్ ఇచ్చిన శిక్షణ, సూచనల ద్వారా మిజోరంతో జరిగిన మ్యాచ్‌లో 337 పరుగులు సాధించగలిగానని చెప్పాడు. రవీంద్ర జడేజా ఆటతీరును అప్పుడప్పుడూ చూస్తు వుంటానని అశుతోష్ వెల్లడించాడు.