మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 6 ఆగస్టు 2022 (11:56 IST)

Vice-Presidential Poll: ఓటు వేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Narendra Modi
ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. దీనితో తదుపరి భారత ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పార్లమెంటు ఉభయ సభల సభ్యులు శనివారం ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఓట్లు వేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ మన్మోహన్ సింగ్ శనివారం పార్లమెంట్ హౌస్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాయి. ప్రతిపక్షాలు మార్గరెట్ అల్వా పేరును ప్రతిపాదించాయి. భారత కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే పోలింగ్ న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

 
జనతాదళ్ (యునైటెడ్), వైఎస్‌ఆర్‌సిపి, బిఎస్‌పి, ఎఐఎడిఎంకె, శివసేన తదితర ప్రాంతీయ పార్టీల మద్దతుతో ధనఖర్ 515 ఓట్లతో సులువుగా విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం), తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) మద్దతుతో అల్వాకు 200 ఓట్లు వచ్చే అవకాశం ఉంది.


విపక్ష శిబిరంలో మరోసారి చీలిక వచ్చింది. ఉభయ సభల్లో 39 మంది ఎంపీలతో పార్లమెంటులో కాంగ్రెస్ తర్వాత రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ శనివారం ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అల్వా అభ్యర్థిత్వంపై తమతో సంప్రదింపులు జరపలేదని ఆ పార్టీ ఎత్తి చూపింది.