శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (14:42 IST)

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మాస్క్ మస్ట్: టీటీడీ

face mask
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు టీటీడీ మాస్క్‌ను మస్ట్ చేసింది. సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
 
ఈ క్రమంలో బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు మాస్క్ తప్పని సరిగా ధరించాలని టీటీడీ చైర్మన్ చెప్పారు. తిరుమల, అలిపిరిలో భక్తుల కోసం తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తామన్నారు. 
 
అన్నమయ్య భవనంలో గురువారం సాయంత్రం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డితో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. 
 
ఆర్జిత సేవలు, శ్రీవాణి, విఐపీ బ్రేక్ దర్శనాలు, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
సెప్టెంబర్ 26న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. సెప్టెంబర్ 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం వుంటుంది. 
 
* తొలిరోజైన సెప్టెంబర్ 27న సాయంత్రం సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
* బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబర్ 1న గరుడ సేవ, 2న స్వర్ణ రథం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం.
* తొలిరోజు ధ్వజారోహణం కారణంగా రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనసేవ. మిగతా రోజుల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు.
 
* కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవలు నిర్వహించేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు. భక్తుల రద్దీకి తగ్గట్టు ప్రతిరోజూ 9 లక్షల లడ్డూల బఫర్ స్టాక్ వుంటుందని టీటీడీ అధికారులు తెలిపారు.