గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ.. ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి సీఎం స్థాయికి
గుజరాత్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం తీవ్రంగా పోటీ పడిన ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి నితిన్ పటేల్ ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. గుజరాత్ రాజకీయ చరిత్రలో డిప్
గుజరాత్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం తీవ్రంగా పోటీ పడిన ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి నితిన్ పటేల్ ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. గుజరాత్ రాజకీయ చరిత్రలో డిప్యూటీ సీఎం పదవి ఉండటం ఇదే తొలిసారి. గుజరాత్‌లో పార్టీ పరిశీలకుడిగా వ్యవహరించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం సాయంత్రం రూపానీ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలను చేపడుతున్నట్టు ప్రకటించారు. రూపానీ, నితిన్ పటేల్ పేర్లను సీఎం ఆనందీబెన్ పటెల్ ప్రతిపాదించగా, పలువురు ఎమ్మెల్యేలు బలపరిచారు.
అంతకుముందు రూపానీ, నితిన్ పటేల్ ఎంపికపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ క్రమంలో సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన శాసనసభాపక్ష సమావేశం 2 గంటలు ఆలస్యంగా జరిగింది. రోజంతా రాష్ట్ర రాజధానిలో రాజకీయ నేతల హడావుడిగా భారీగా కనిపించింది. చివరకు విజయ్ రూపానీ పేరును సీఎంగా ఖరారు చేస్తూ బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది.
కాగా, గుజరాత్ కొత్త సీఎం విజయ్ రూపానీ 1956 ఆగస్టు 2న అప్పటి బర్మా రాజధాని రంగూన్ (ప్రస్తుతం మియన్మార్, యాంగోన్)లో జన్మించారు. జైన్ కమ్యూనిటీకి చెందిన ఈయన పాఠశాల స్థాయి నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆరెస్సెస్), ఏబీవీపీ కార్యకర్తగా అంకితభావంతో సేవలందించారు. అమిత్‌షాకు అత్యంత సన్నిహితుడైన రూపానీ గుజరాత్ అసెంబ్లీకి ఎన్నిక కావడం ఇదే తొలిసారి. సౌరాష్ట్ర ప్రాంతంలో బలమైన నేతగా పేరున్నది.
బీఏ, న్యాయశాస్త్రంలో పట్టభద్రుడైన రూపానీ 2006 నుంచి 2012 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. జలవనరులు, ఆహారం, ప్రజాపంపిణీ, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీలకు ప్రాతినిథ్యం వహించారు. 2014లో రాజ్‌కోట్ పశ్చిమ అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికలో భారీ విజయాన్ని సొంతం చేసుకొన్నారు. ఆర్సీ ఫాల్దు స్థానంలో ఫిబ్రవరి 19న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టారు.
డిప్యూటీ సీఎంగా వ్యవహరించనున్న నితిన్ పటేల్ ప్రస్తుత క్యాబినెట్‌లో అత్యంత సీనియర్ నాయకుడు. తొలిసారి 1990లో శాసనసభకు ఎన్నికైన ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం ఇది నాలుగోసారి. గుజరాత్‌లోని మెహ్‌సానా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన నితిన్ పటేల్ ఆనందీబెన్ క్యాబినెట్‌లో ఆరోగ్యం, రోడ్లు, భవనాలు, తదితర శాఖలను నిర్వర్తిస్తున్నారు.