శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 మే 2021 (14:07 IST)

రెమ్‌డెవిసిర్ మందులో గ్లూకోజ్ వాటర్... వార్డ్‌బాయ్ నిర్వాకం...

దేశ ప్రజలు కరోనా కష్టాలతో అల్లాడిపోతున్నారు. వీటికితోడు ఆస్పత్రుల్లో పని చేసే వైద్యులు, నర్సులు, సిబ్బంది చేస్తున్న చేష్టలకు మరింతగా విసుగెత్తిపోతున్నారు. ముఖ్యంగా, నానాటికీ కొవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతుంటే ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, ప్రాణాధార మందుల‌ను బ్లాక్ మార్కెట్ చేసి కొంద‌రు అందిన‌కాడికి దండుకుంటున్నారు. 
 
తాజాగా గుజ‌రాత్ రాష్ట్రంలోని ఓ ద‌వాఖాన‌లో వార్డ్ బాయ్ రెమ్‌డెసివిర్‌ మందులో గ్లూకోజ్ వాట‌ర్ క‌లిపి అవ‌స‌ర‌మైన రోగుల‌కు అధిక ధర‌ల‌కు విక్రయిస్తూ సొమ్ము చేసుకున్న ఘ‌ట‌న వెలుగుచూసింది. జ‌గ‌దీష్ ప‌ర్మ‌ర్ అనే వార్డ్ బాయ్ న‌దియాద్ సివిల్ ఆస్ప‌త్రిలో ప‌నిచేస్తూ నెల‌న్న‌ర‌గా ఇదే ప‌నిలో ఉన్నాడు.
 
రెమ్డిసివిర్ బాటిల్స్‌లో గ్లూకోజ్ నీళ్ల‌ను క‌లిపి కొవిడ్ రోగులు, బంధువుల‌కు బాటిల్‌ను రూ.4500 నుంచి రూ.5000 వ‌ర‌కూ విక్ర‌యిస్తూ సొమ్ము చేసుకుంటున్న‌ట్టు పోలీసులు గుర్తించారు. రెమ్‌డెసివిర్ బాటిల్‌లో 60 శాతం గ్లూకోజ్ వాట‌ర్‌ను నిందితుడు క‌లిపేవాడు. 
 
బాటిల్‌పై బ్రాండ్ స్టిక్క‌ర్లు ఉండ‌టంతో వీటిని న‌కిలీవ‌ని ఏ ఒక్క‌రూ గుర్తించ‌లేక పోయారు. అలా కొన్ని రోజులుగా ఈ దందా కొనసాగిస్తూ వచ్చాడు. ఈ బండారం బయటడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అత‌డిపై ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.