శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (06:26 IST)

స్థానికులకు ఉద్యోగాలు కరువైతే ఎవరైనా ట్రంప్‌లు కావలసిందే: తేల్చి చెప్పిన ఇన్ఫోసిస్ కో-ఫౌండర్

దేశంలో నిరుద్యోగితా స్థాయి దారుణంగా పడిపోతున్నప్పుడు ఏ దేశ రాజకీయ నేతలైనా నిరుద్యోగిత శాతాన్ని వీలైనంత తగ్గించాలనే చూస్తారని, అమెరికాలో అయినా, ఇండియాలోనైనా, మరే దేశంలోనైనా పరిస్థితి ఇలాగే ఉంటుందని, ఇ

దేశంలో నిరుద్యోగితా స్థాయి దారుణంగా పడిపోతున్నప్పుడు ఏ దేశ రాజకీయ నేతలైనా నిరుద్యోగిత శాతాన్ని వీలైనంత తగ్గించాలనే చూస్తారని, అమెరికాలో అయినా, ఇండియాలోనైనా,  మరే దేశంలోనైనా పరిస్థితి ఇలాగే ఉంటుందని, ఇదే వాస్తవమని ఇన్ఫోసిస్ సంస్థ సహ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ మూర్తి స్పష్టం చేశారు. పైగా ప్రభుత్వాలతో వ్యాపార వర్గాలు, సంస్థలు ఎన్నడూ పోట్లాడలేవని, మనముందున్న పరిస్థితి తీవ్ర ఇబ్బందులు ఎదురైనప్పుడు కొత్త అవకాశాలకోసం వెతుక్కోవడమే పరిష్కారం అన్నారు. 
 
వ్యాపారవర్గంగా ప్రభుత్వాలు తీసుకునే ఏ చర్యనూ మనం తప్పుపట్టలేం. వారిపైనే నిందలువేయలేం. ఇప్పుడు అమెరికాలో ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్నారు. చేయడం తప్పు కాదు. కాని ఇదే పరిస్థితుల్లో భారత్ ఎలా వ్యవహరించిందో కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. యూపీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారత్‌లో విద్యుత్ ప్లాంట్‌లు నిర్మించడానికి చైనా కంపెనీలు కాంట్రాక్టులు సంపాదించాయి. తీవ్రమైన పోటీ పరిస్థితుల్లో లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయడానికి చైనా నుంచి కార్మికులను తీసుకురావాలని వారనుకున్నారు. అప్పుడు భారత ప్రభుత్వం ఏమన్నదో తెలుసా. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో పాలుపంచుకునే నిర్మాణ కార్మికులకు సంవత్సరానికి 25 వేల డాలర్లను కనీస వేతనంగా ఇవ్వాలని మన ప్రభుత్వం చెప్పింది. అంటే భారత్‌లో మనం అదే నిర్మాణ కార్మికుడికి ఇస్తున్న వేతనానికి ఇది ఆరేడు రెట్లు అధికమన్నమాట. 
 
అంటే అమెరికా మాత్రమే స్థానికులకు అనుకూలంగా వ్యవహరించడం లేదన్నమాట. గతంలో మనం కూడా అలాగే చేశాం. మన రాజకీయ నేతలు తీసుకున్న మంచి నిర్ణయం అని కూడా గుర్తించాం. అందుకే రాజకీయ నాయకులను మనం తప్పు పట్టలే. ఈ సమస్యపై వివాదాలను సృష్టించాలని కూడా నా అభిమతం కాదు. ఇలాంటి వాటిని వాస్తవికతలో భాగంగానే నేను గుర్తిస్తాను. వీసాలపై మనం ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించుకునేలా ఒక యంత్రాంగాన్ని ఏర్పర్చుకోవలసిన బాధ్యత మనమీదే ఉంది అన్నారు ఎన్ఆర్ మూర్తి.
 
ఏ మేనేజ్‌మెంట్ అయినా, ఓ బోర్డు అయినా సరే ప్రభుత్వ పాలసీలపై మరీ ఎక్కువగా ఆధారపడకూడదు. నష్టాలన గుర్తించడంలో ఇదొక ప్రాథమిక సూత్రం. ఎందుకంటే ఇది చాలా పెద్ద రిస్కు. ప్రభుత్వాలపై మీకు నియంత్రణ ఉండదు. ఒక చిన్న ఉదాహరణ. 1980ల మొదట్లో భారత ప్రభుత్వం కంప్యూటర్ల దిగుమతిని చాలా కష్ట సాధ్యం చేసింది. అప్పట్లో టెలిపోన్ లైన్లు లేవు. కమ్యూనికేషన్ లైన్లు అసలే లేవు. అప్పుడు ఇన్ఫోసిస్‌లో మేమేం చేశాం. ఆ సమయంలో అమెరికా ప్రభుత్వం చాలా స్నేహపూర్వకంగా ఉండేది. దాంతో మేం మొత్తం ప్రాజెక్టులను ఆన్‌సైట్‌లోనే చేసేవాళ్లం. వాస్తవానికి నా సహచరులు నందన్, క్రిస్, షిబు, రాఘవన్ అందరూ అమెరికాలోనే ఉండేవారు. భారత్‌లో ఉన్న ఏకైక వ్యక్తిని నేనే అన్నారు మూర్తి.
 
కాబట్టి మనం ఏ ప్రభుత్వంతో అయినా సరే పోట్లాట పెట్టుకోలేం. అమెరికా ప్రభుత్వం, బ్రిటన్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఇలా ఏ ప్రభుత్వంతో అయినా సరే వ్యాపార సంస్థలు పోరాడలేవు. ప్రభుత్వాలు విధించే అవరోధాల మధ్యనే మనం పనిచేయవలసి ఉంటుంది. అప్పుడే మన కంపెనీలు సురక్షితంగా ఉండేలా అనేక సృజనాత్మక ఆవిష్కణలను మనం తీసుకురాగలం. అప్పుడే మన కంపెనీలు ఎదుకుతాయి.మన లాభదాయకత కూడా పెరుగుతుంది. అప్పుడే మన కస్టమర్లను మనం విజేతలుగా చేయగలం. ఇప్పుడు కూడా మనం చేయవలిసింది ఇదే అని సూచించారు నారాయణ మూర్తి
 
ప్రభుత్వాలతో, అవి సృష్టించే అవరోధాలతో ఘర్షణ పడకుండా తమ పని తాము చేసుకుపోవడమే పరిశ్రమల, వాణిజ్యవేత్తల విధి అంటూ నారాయణ మూర్తి చెప్పిన విధానం ఇన్ఫోసిస్ గత న మూడున్నర దశాబ్దాల అభివృద్ధి క్రమాన్ని విప్పి చెపుతున్నట్లుంది.
 
ఎనీ డౌట్స్?