శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (17:53 IST)

ముఖ్యమంత్రి పదవి ఇపుడే చేపట్టాలనుంది : అజిత్ పవార్

ajit pawar
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసకందాయంలో పడ్డాయి. అజిత్‌ పవార్‌ తన మద్దతుదారులతో కలిసి భాజపాలో చేరతారనే ఊహాగానాలకు తోడు.. ముఖ్యమంత్రి పదవి ఇప్పుడే చేపట్టాలనుందంటూ ఆయన వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఈ క్రమంలోనే శివసేన నేత సంజయ్‌ రౌత్‌ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ శిందే ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. రానున్న 15- 20 రోజుల్లో ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు.
 
ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌తో సహా అనేక పిటిషన్లపై పెండింగ్‌లో ఉన్న సుప్రీంకోర్టు తీర్పును సంజయ్‌ రౌత్‌ ప్రస్తావించారు. తమ పార్టీ కోర్టు ఆదేశాల కోసం వేచి చూస్తోందని, తమకు న్యాయం జరుగుతుందన్నారు. 
 
'ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన 40 మంది ఎమ్మెల్యేల ప్రభుత్వం 15- 20 రోజుల్లో కూలిపోతుంది. ఈ మేరకు ఇప్పటికే 'డెత్‌ వారెంట్‌' జారీ అయింది' అని రౌత్‌ పేర్కొన్నారు. గత ఏడాది జూన్‌లో శిందేతోపాటు 39 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉద్ధవ్‌ నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో పార్టీలో చీలిక ఏర్పడింది. ఫలితంగా ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. 
 
తదనంతరం భాజపాతో కలిసి ఏక్‌నాథ్‌ శిందే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. మరోవైపు తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం పిటిషన్‌ దాఖలు చేసింది. ఇటు శిండే వర్గం క్రాస్ పిటిషన్‌ వేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. గత నెలలో తన తీర్పును రిజర్వ్ చేసింది.