గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (15:59 IST)

మహిళ పట్ల డెలివరీ బాయ్ వికృతచేష్టలు.. గిఫ్టు కూపనిచ్చి సరిపెట్టిన స్విగ్గీ

బెంగుళూరులో ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ కస్టమర్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగుళూరుకు చెందిన యువతి తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
 
గత శనివారం బెంగుళూరుకు చెందిన ఓ యువతి స్విగ్గీలో ఫుడ్ఆర్డర్ చేసింది. ఆర్డర్ చేసిన ఫుడ్‌ను డెలివరీ బాయ్ తీసుకురావడంతో అది తీసుకోవడానికి ఆ యువతి బయటికి వెళ్లింది. ఆ యువతిని చూసిన డెలివరీ బాయ్ వికృత చేష్టలు చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో అతను ఏం చేస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. తర్వాత అతన్ని పరిశీలించగా అతని వెకిలి చేష్టలు అర్థమై ఆమె అతని ముఖంపై తలుపు వేసుకుని లోపలికి వెళ్లిపోయింది.
 
జరిగిన విషయాన్ని వెంటనే కస్టమర్ కేర్ సెంటర్‌కు ఫోన్ చేసి చెప్పింది, అలాగే ఈ విషయం గురించి ఫేస్‌బుక్‌లో కూడా పోస్ట్ చేసింది. కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసిన వెంటనే స్విగ్గీ అధికారులు రంగంలోకి దిగి ఆమెకు క్షమాపణలు చెప్పారు. అలాగే ఆమెకు స్విగ్గీలో రూ.200 కూపన్‌ను పరిహారంగా అందించారు. అలాగే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీసి, అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.