పెళ్లి పేరుతో ముంబై మహిళా వ్యాపారవేత్త వద్ద రూ.5 కోట్లు మోసం
ముంబై నగరానికి చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త కామాంధుడి చేతిలో మోసపోయింది. పెళ్లి పేరుతో రూ.5 కోట్లు మోసం చేయడమే కాకుండా, ఆమెను లొంగదీసుకుని పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారణ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. ముంబైకి చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హైదరాబాద్ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మనీశ్ భాటి సహా పలువురిపై కేసు నమోదు చేశారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలో దిగుమతి వస్తువుల వ్యాపారం చేసే మహిళకు 2024 జులైలో మనీశ్ భాటితో వ్యాపార రీత్యా పరిచయం ఏర్పడింది. తొలుత పిస్తా, లవంగాల వ్యాపారం కోసం సరుకులు తీసుకుని, నమ్మకం కలిగించేందుకు సకాలంలో డబ్బులు చెల్లించాడు.
ఆ తర్వాత 2024 నవంబరు నుంచి చెల్లింపుల్లో జాప్యం చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో తన సోదరుడు పవన్ భాటితో పాటు మహ్మద్ రషీద్, జీషాన్ అహ్మద్, నదీమ్ జుమానీ, ఇర్ఫాన్ భాడా వంటి వారిని పరిచయం చేసి, వారి సంస్థల పేరుతో కూడా భారీగా సరుకులు తీసుకుని బకాయిలు పెట్టారు.
బాధితురాలు బకాయిల కోసం నిలదీసినప్పుడల్లా, మనీశ్ భాటి ప్రేమ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చేవాడు. తాను అవివాహితుడినని, తప్పకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. వీడియో కాల్స్ మాట్లాడే సమయంలో ఆమెకు తెలియకుండా ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు రికార్డు చేశాడు.
గత ఏడాది ఆగస్టు 5న హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత సెప్టెంబరు 9, 11 తేదీల్లో కూడా వేర్వేరు హోటళ్లలో మద్యం తాగించి, పెళ్లి పేరుతో నమ్మిస్తూ అత్యాచారం చేశాడు.
బకాయిలు చెల్లించాలని గట్టిగా అడిగితే, ఆమె ప్రైవేట్ ఫొటోలను వ్యాపారుల వాట్సాప్ గ్రూపుల్లో పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో బాధితురాలు ముంబైలోని మహిమ్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయగా, అక్కడ జీరో ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసి, నవంబరు 13న కేసును పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
తన ఫిర్యాదులో, నిందితులు తనకు మొత్తం రూ.5,09,81,914 బాకీ ఉన్నారని బాధితురాలు పేర్కొన్నారు. ఇందులో మనీశ్ భాటి సంస్థలు రూ.1.67 కోట్లు, ఇర్ఫాన్ భాడా రూ.1.97 కోట్లు, నదీమ్ జుమానీ రూ.1.17 కోట్లు, జీషాన్ అహ్మద్ రూ.25.79 లక్షలు, పవన్ భాటి రూ.6.25 లక్షలు బకాయి ఉన్నట్లు వివరించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

