గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (13:01 IST)

కాలసర్ప, కేతు దోషం ఉన్నవారు కుమార స్వామికి పూజ చేస్తే..? (video)

మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే.. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణజన్ముడు. తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు. దేవగణానికి సర్వసేనాధిపతి. సర్వశక్తిమంతుడు. ఆది దంపతులైన శివపార్వతులకు ముద్దుల తనయుడు. తారకాసురుడు రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సుచేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. 
 
అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులెవ్వరివల్ల తనకు మరణం లేకుండా వరం పొందుతాడు. తారకుడి బాధలు పడలేక దేవతలు తమకొక శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని శివుడ్ని వేడుకున్నారట. శివుడు వారి కోరికమేరకు కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకుడ్ని సంహరించాడు. అందువల్ల తారకుడి సంహారం కోసం జన్మించినవాడు కుమారస్వామి. అతనికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరుకూడా వుంది. 
 
సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునుకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి, సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. కొందరు కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్యస్వామి, సర్ప పూజలు చేయాలంటారు. 
 
మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కుజుడు మనిషికి శక్తి, ధనాన్ని ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనచేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడంవల్ల, సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి.
 
అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి, రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది. మంగళవారం, శుద్ధ షష్టి, మృగశిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి, సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం, కుజమంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర, శత నామావళితో పూజచేయాలి.
 
ఇలా తొమ్మిది రోజులు జపమూ, పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతారు. దీనివల్ల కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. ఈ పూజా అనంతరం సర్ప సూక్తం లేదా సర్పమంత్రాలు చదవడంవల్ల ఇంకా మేలు జరుగుతుంది. 
Kumara swamy
 
జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వవిధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ, పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజలవల్ల రాహుగ్రహం అనుగ్రహమూ కలుగుతుంది. 
 
అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. సంతానప్రాప్తి కోసం వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం.
 
అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టూ 21 లేదా 108మార్లు మండలం పాటు అంటే 40 రోజులు ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరంచేసి, సర్వశక్తుల్ని ఇస్తుందని అంటారని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.