సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం.. ఉసిరి దీపం వెలిగిస్తే..?

Amla Deepam
కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి. ఇందులో భాగంగా మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభి షేకాలను చేయించినట్లయితే కోటిజన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని "త్రిపురి పూర్ణిమ'', ''దేవ దీపావళి'' అని కూడా అంటారు. 
 
మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుడిని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానారకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. 
 
కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం. అంతేగాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లైతే శుభం చేకూరుతుంది. 
 
శివ అష్టోత్తరం, లింగాష్టకం వంటి పారాయణ, అష్టోత్తరాలను పఠించడం వల్ల సకల సంపదలు చేకూరుతాయి. పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి.. ఆలయానికి వెళ్లి శివుడిని దర్శించుకోవాలి. సాయంత్రానికి శుచిగా ఉసిరికాయపై దీపాలు వెలిగించాలి. బియ్యంపిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. 
 
దీపారాధనకు ఆవునెయ్యిని కానీ నువ్వుల నూనెను కాని వాడవచ్చు. కార్తీకమాసంలో దీపదానం చేస్తే పుణ్యమని పురాణాలు చెప్తున్నాయి. ఇంకా దేవాలయాల్లో చేసే దీపారాధన ద్వారా పుణ్యలోకాలు సిద్ధిస్తాయి. కార్తీక పౌర్ణమి నాడు చేసే ఏ దానంతోనైనా జన్మాంతర పాపాలు తొలగిపోతాయి. ఇంకా ఆ రోజున శివునికి అభిషేకాలు చేయిస్తే సర్వ శుభాలు చేకూరుతాయి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చెరకు రసం, కొబ్బరి నీరు, నీరు, బియ్యం పిండితో అభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.