శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (22:44 IST)

మంగళవారం కుమార స్వామి ఆరాధన.. విశిష్టత.. సేనాని ఎలా అయ్యాడంటే..?

మంగళవారం కుమార స్వామిని ఆరాధించినట్లైతే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. వాస్తు దోషాలు, సర్ప దోషాలు వీడిపోతాయి. అలాగే స్వామి వారి విశిష్టత ఏంటంటే.. సుబ్రహ్మణ్యుని చేతిలో ఉన్నటువంటి ఆయుధము శక్త్యాయుధము అని చెప్పబడుతుంది. అందుకే "ప్రథమో జ్ఞాన శక్త్యాత్మా" - పైగా దానికి జ్ఞాన శక్త్యాయుధమని పేరు. అంటే ఆ ఆయుధంలో రెండు విశేషములున్నాయి. 
 
జ్ఞానము, శక్తి రెండు చెప్పబడుతున్నాయి. అసలు జ్ఞానానికే పెద్ద శక్తి ఉంది. ఎంతటి శక్తి ఉంది అంటే ఎవరూ ఛేదించలేని అజ్ఞానాన్ని ఛేదించడమే జ్ఞానముయొక్క శక్తి. అలా జ్ఞానశక్తి ఆయనయొక్క ఆయుధం. ఇది భావన చేసినప్పుడు ఆయన గురుస్వరూపంగా కనిపిస్తాడు.
 
అసుర సంహారం చేసినటువంటి మహా ప్రతాపమూర్తి కుమార స్వామి. "సేనానీనాం అహం స్కందః" అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి మాట. సేనానులలో స్కంధుడు. స్కందుడు అని సుబ్రహ్మణ్యునికి మరొక పేరు. చెల్లాచెదురైనటువంటి దేవసేనలన్నింటినీ సమీకరించి వారందరికీ తాను బలమై, బలాన్ని ఇచ్చి నడిపించి అసుర శక్తులను సంహరించాడు. 
 
అందుకే ఎప్పుడైనా సరే కాలంలోనూ, దేశంలోనూ ప్రపంచాన్ని బాధించే అసుర శక్తులు ఉన్నవేళ సుబ్రహ్మణ్య ఆరాధన గానీ చేసినట్లయితే వెంటనే అసుర శక్తులు తొలగి దేశానికీ, కాలానికీ, వ్యక్తికీ కూడా క్షేమం లభిస్తుంది. అలాంటి క్షేమం కావలసినటువంటి వారు సుబ్రహ్మణ్యారాదన విశేషంగా చేయాలి. దీనివల్ల బాధించె శక్తులు తొలగుతాయి. అందుకు ప్రత్యేకించి దేవతలందరూ కూడా దేవసేనాపతి ఆవిర్భావానికి తపన పడ్డారు. 
 
శివశాక్త్యాత్మకంగా ఆవిర్భవించాడు సుబ్రహ్మణ్యుడు. ఆయన ఆవిర్భావంతో దేవతలందరికీ బలం వచ్చింది. అసలు బలమే ఆయనయొక్క స్వరూపం. అందుకే సేనాని అయ్యాడు. అందుకు లోక క్షేమంకరమైన ఉత్తమ శక్తులు చెల్లాచెదురై బలం తగ్గినప్పుడు వాటన్నింటికీ బలాన్నిచ్చి నడిపించేటటువంటి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామిగా నిలబడతాడు. అలాంటి సేనానిగా నిలిచిన కుమార స్వామిని ఎవరైతే నమస్కరిస్తారో వారికి దేవతలందరి రక్షణ లభిస్తుంది.