సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 అక్టోబరు 2020 (19:20 IST)

చండీయాగం చేస్తే అంత మేలు జరుగుతుందా? (Video)

Chandi Devi
లోక కల్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోంది. అదీ నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రోజు పూజించడం ద్వారా సకలాభీష్టాలు చేకూరుతాయి. ఆదితత్త్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య. అది లలితా పారాయణం, చండీ పారాయణం అని రెండు రకాలు. 
 
బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లలితాదేవి మహిమలను చెబితే, మార్కండేయ పురాణం చండీ మహత్మ్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతోపాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తిమంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి. దుర్గ లేదా చండీ సప్తశతి మూడు చరిత్రలుగా, 13 అధ్యాయాలుగా ఉంటుంది. 
 
తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. రెండో భాగంలో మూడు అధ్యాయాలు, మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మధుకైటభ వర్ణన, మహిషాసుర సంహారం, శుంభనిశుంభుల వధతోపాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి.
 
సప్తశతిని మూడు పద్ధతుల్లో ఆచరిస్తారు. పూజ, పారాయణ, హోమం. ఈ మూడు పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు. పారాయణలో దశాంశం హోమం, దశాంశం తర్పణం ఇస్తారు.చండీ హోమానికి సంబంధించి నవ చండీ యాగం, శత చండీ యాగం, సహస్ర చండీ యాగం, అయుత (పది వేలు) చండీ యాగం, నియుత (లక్ష) చండీ యాగం, ప్రయుత (పది లక్షలు) చండీ యాగం ఉంటాయి.
 
ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. దుఃఖం అనేది రాదు.ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. లోక కల్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది.
 
కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫలసాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం. ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు. 
Homam
 
వీటిలో నవ చండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట. ఏకాదశ చండి చేస్తే రాజు వశమవుతాడని, ద్వాదశ చండి చేస్తే శత్రు నాశనమని, మను చండి (చతుర్దశ చండి)తో శత్రువు వశమవుతాడని మార్కండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది. ఇక, శత చండి చేస్తే కష్టాలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం తదితరాలు తొలగుతాయి. సహస్ర చండితో లక్ష్మీదేవి వరిస్తుంది. కోరికలు నెరవేరతాయి.
 
లక్ష చండి చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో ఉంది. దీనినే అయుత చండి అంటారు. ప్రయుత చండి అంటే పది లక్షల చండీ సప్తశతి పారాయణాలు. దీని పారాయణాలతో ఆర్థిక, మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి.