బుధవారం, 8 అక్టోబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 అక్టోబరు 2025 (11:13 IST)

కాముని పున్నమి.. లక్ష్మీదేవి ఉద్భవించిన పూర్ణిమ.. పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి?

Purnima
ప్రతి నెల వచ్చే పౌర్ణమి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమి తిథికి మాత్రం మరికొంత విశేషమైన ప్రాముఖ్యత ఉంది. దీనిని అదే శరద్‌ పూర్ణిమ, కాముని పున్నమి అని కూడా అంటారు. ఈ ఏడాది ఈ పూర్ణిమ 2025 అక్టోబర్ 6వ తేదీ సోమవారం వచ్చింది. 
 
ఈ పూర్ణిమ రోజున చంద్రుడి నుంచి అమృత వర్షం కురుస్తుందని విశ్వాసం. అంతేకాదు ఈ శరద్‌ పూర్ణిమ రోజున లక్ష్మీదేవి  సాగర మథనం నుంచి ఉద్భవించిందని పురాణ గాథ. అందుకే ఈ రోజున ఈ శరద్‌ పూర్ణిమ రోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు ఆచరిస్తారు. అలాగే ఈ రోజున శ్రీమహావిష్ణువును, చంద్రుడిని కూడా పూజిస్తారు. 
 
శరద్‌ పౌర్ణమి తిథి అక్టోబర్ 6వ తేదీన మధ్యాహ్నం 12.23 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 7వ తేదీ ఉదయం 9.16 గంటలకు ముగుస్తుంది. ఈరోజు చేసే పూజలో లక్ష్మీదేవికి కమలం పువ్వు, తెల్లటి స్వీట్లు, పాయసం వంటివి సమర్పించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. 
 
అలాగే.. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ సిద్ధ లక్ష్మీయే నమః మంత్రాన్ని 108 సార్లు జపించడం శుభప్రదం. కొంత మంది ఈరోజున చంద్రుడిని, సత్య నారాయణ స్వామిని కూడా విశేషంగా పూజిస్తారు. శరద్‌ పూర్ణిమ రోజు రాత్రి వేళ చంద్రుని కిరణాలు చాలా శక్తివంతమైనవట. 
 
ప్రత్యేక ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయట. కాబట్టి శరద్‌ పౌర్ణమి రోజు రాత్రి ఆవు పాలతో చేసిన పాయసం చంద్రకాంతి పడే విధంగా ఉంచి తర్వాతి రోజు ఉదయం దాన్ని తినడం అమృతంగా భావిస్తూ తింటారు. 
 
ఈ పాయసం తినడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా సానుకూల శక్తిని అందిస్తుందని బలమైన విశ్వాసం. అలాగే ఈ రోజున పేదలకు ఆహారం, దుస్తులు వంటివి దానం చేయడాన్ని అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు.