శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (09:43 IST)

మహాలయ అమావాస్య: కర్ణుడు భూలోకంలో గడిపి స్వర్గానికెళ్లిన ఆ పక్షం రోజులే...

నేడు మహాలయ అమావాస్య. పితృకర్మలు పాటించలేనివారు ఈ మహాలయ అమావాస్య నాడు ఉదయ కాలమున మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి, మీ పితృదేవతలను స్మరించి, వారికి నమస్కారము చేస్తూ, "నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి, మీ దీవెనలు అందచేయండి’ అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు.
 
భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో, బహుళ పక్షం పితృదేవతా పూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.

 
తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య రోజునైనా చేయాలి.

 
మహాలయ అమావాస్య గురించి పురాణాల్లో ఓ కథ వుంది. దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గ లోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది.

 
ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పికయినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.

 
స్వర్గ లోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’ అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.

 
కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

 
ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు. పితృదేవతలకు తర్పణాలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.

 
ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.