తిరుమలకు యథేచ్చగా తరలిపోతున్న నిషేధిత వస్తువులు.. పట్టించుకోని తితిదే సెక్యూరిటీ
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువై ఉన్న తిరుమలకు నిషేధిత వస్తువులు యధేచ్ఛగా తరలిపోతున్నాయి. తిరుపతిలో దొరికే మద్యం, మాంసం తిరుమలలో కూడా సులువుగా దొరుకుతుందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తితిదే సెక్యూరిటీ, పోలీసు విభాగం ఏ మాత్రం పనిచేస్తోందో. తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమలకు వెళ్ళే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసే కేంద్రం ఉంది. తితిదే సెక్యూరిటీతో పాటు పోలీసులు ఈ కేంద్రంలో పనిచేస్తుంటారు.
ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు వాహనాలలో ఈ మార్గం గుండానే వెళ్ళాల్సి ఉంటుంది. వాహనాలను అలిపిరి తనిఖీ కేంద్రంలో క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపాల్సి ఉంటుంది. అయితే తితిదేతో పాటు పోలీసులు ఆ పని చేయరు. తమకు తెలిసిన వాహనాలను తనిఖీలు చేయకుండానే పంపిచేస్తుంటారు. కారణం నిషేధిత వస్తువులు అందులో ఉండడమే. మద్యం, మాంసాన్ని వాహనాల్లో కొంతమంది తీసుకెళుతుంటారు.
ఆ వాహనాల నెంబర్లు, వారి వివరాలు సెల్‌ఫోన్ల ద్వారా టిటిడి సెక్యూరిటీకి ముందుగానే వెళ్ళిపోతుంది. ఇంకేముంది ఆ వాహనం రాగానే హడావిడిగా అందులోని భక్తులను దించి చెక్ చేస్తారు కానీ.. వాహనాన్ని మాత్రం ఏ మాత్రం చెక్ చేయరు. సీట్ల కింద, డిక్కీలో తనిఖీ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తారు కానీ... అక్కడే మద్యం, మాంసం ఉన్నా దాన్ని పక్కకు తోసేసి వాహనాల తలుపులు మూసేస్తారు.
తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు నిషేధిత వస్తువులు తిరుమలకు వెళ్ళేందుకు అందరు బాధ్యులేనని చెప్పుకోవచ్చు. తిరుపతిలో మాంసం 150రూపాయలు అమ్మితే తిరుమలలో 500 నుంచి 600 రూపాయలు అమ్ముతారు. మద్యం 100 రూపాయలు తిరుపతిలో విక్రయిస్తే తిరుమలలో 400కిపైగా విక్రయిస్తారు. దీన్ని బట్టి తెలుస్తుంది వీరు ఎంత డిమాండ్‌తో తిరుమలలో నిషేధిత వస్తువులను విక్రయిస్తున్నారో. మరో ప్రధానమైన విషయమేమిటంటే తిరుమలకు వెళ్ళే కాలినడక మార్గం నుంచి గుండా కొంతమంది నిషేధిత వస్తువులను తరలిస్తున్నారనే సమాచారం లేకపోలేదు.
అలిపిరి పాదాల మండపంతో పాటు, శ్రీవారి మెట్టు వద్ద గుండా భక్తులు తిరుమలకు నడిచి వెళుతుంటారు. కాలినడక మార్గం గుండా వెళ్ళే కొంతమంది నిషేధిత వస్తువులను తీసుకెళ్లి తిరుమలలో విక్రయిస్తున్నారని తితిదే ఉన్నతాధికారులకు సమాచారం ఉంది. విక్రయాల్లో అందరు భాగస్వామ్యులే... అందరికీ ఇందులో డబ్బులే.
కాలినడక మార్గంలో కూడా తనిఖీ కేంద్రం ఉన్నా సరే వీరు కూడా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద చేసే పనే చేస్తున్నారు. ఇంకేముంది.. షరా మామూలే.. ఇదిలావుంచితే తిరుమలలో నిషేధిత వస్తువులు విక్రయించడానికి ఒక ముఠానే ఉందంటే ఈ వ్యాపారం తిరుమలలో ఏ మాత్రం సాగుతుందో అర్థమవుతుంది. గతంలో ఎంతో రహస్యంగా జరిగిన ఈ తతంగం ప్రస్తుతం బహిరంగంగానే జరుగుతుందన్న ఆరోపణలు లేకపోలేదు. తిరుమలలోని కొన్ని ప్రాంతాంల్లో మద్యం, మాంసంను విక్రయిస్తుంటారని తితిదే నిఘా, విజిలెన్స్‌తో పాటు పోలీసు అధికారులకు తెలుసు. అయినా వారు మాత్రం పట్టించుకోరు.
తిరుపతి నుంచి తిరుమలకు వాహనాల్లో రాత్రి సమయాల్లో ఎక్కువ మంది షాపుల యజమానులతో పాటు షాపులలో పనిచేసే వారు వెళుతుంటారు. అందులో 20కి శాతంకిపైగా తిరుపతిలో మద్యం సేవించి తిరుమలకు వెళుతుంటారు. అలాంటి వారిని తనిఖీ కేంద్రం పంపించేస్తున్నారు టిటిడి తనిఖీ కేంద్రం సిబ్బంది. గత కొన్నినెలలకు ముందు ఇదేవిధంగా తిరుమలకు చెందిన ఇద్దరు యువకులు ఫ్లూటుగా మద్యం సేవించి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఉంటే వారిని తిరుమలకు పంపేశారు.
వినాయకుడి గుడి వద్ద ఘాట్ రోడ్డు పక్కనే ఉన్న గోడను ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అతి వేగంగా వాహనాన్ని నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు అప్పట్లో నిర్ధారణకు వచ్చారు. మద్యం సేవించిన వ్యక్తులను తిరుమల ఘాట్ రోడ్డులో పంపడం ద్వారానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలన విషయంలో సెషబాష్ అనిపించుకున్న కార్యనిర్వహణాధికారి సాంబశివరావు నిషేధిత వస్తువులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.