ఆదివారం, 3 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 ఆగస్టు 2025 (12:50 IST)

నైట్ రైడర్స్ బార్‌ను ధ్వంసం చేసిన రాజ్ థాక్రే అనుచరులు

raj thackeray
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే అనుచరులు మరోమారు రెచ్చిపోయారు. పన్వేల్‌‍లో నైట్ రైడర్స్ బార్‌పై కర్రలతో దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ముంబై సమీపంలో శనివారం రాత్రి ఈ దాడి ఘటన జరిగింది. రాయ్‌గఢ్ జిల్లాలో డ్యాన్సర్లపై కూడా వారు చేయి చేసుకున్నారు. 
 
ఈ దాడిలో సుమారుగా డజను మందికిపైగా వ్యక్తులు పాల్గొన్నట్టు సమాచారం. దండగులందరూ ఒక్కసారిగా లోపలికి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. ఫర్నిచర్ తోపాటు మద్యం బాటిళ్లపై ప్రతాపం చూపించారు. బార్‌లోని టేబుళ్లు, అద్దాలు పగిలిపోయినట్టు ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
మరాఠీ ఆత్మగౌరవం పేరుతో పదేపదే హింసకు మద్దతిస్తున్న రాజ్ థాక్రే శనివారం పన్వేల్‌లో జరిగిన కిసాన్ మజ్ఞూర్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ శివాజీ మహరాజ్ రాజధాని అయిన రాయగఢ్‌లో డ్యాన్స్ బార్లు ఉండటానికి వీల్లేదని హెచ్చరించారు. 
 
ఆయన వ్యాఖ్యలతో ఎంఎన్ఎస్ కార్యకర్తలు చెలరేగిపోయారు. అర్థరాత్రి డ్యాన్సర్‌కు చేరుకుని విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటనను ఎంఎన్ఎస్ నేత సందీప్ దేశ్ పాండే సమర్థించుకున్నారు. 
 
దీనిని ఆయన 'ప్రతీకాత్మక నిరసన' (సింబాలిక్ ప్రొటెస్ట్)గా అభివర్ణించారు. బార్లు ఉండటం చట్ట విరుద్ధమని, అందుకనే వారు ఆ పని చేశారని చెప్పారు. ప్రభుత్వం వీటిపై దృష్టిసారించాలని సూచించారు. కాగా, రాజ్ థాకరే మద్దతుదారులు ఇటీవల మరాఠీయేతరులపైనా దాడికి పాల్పడ్డారు.