థియేటర్ యజమాని వ్యవహారంలా మారిన తితిదే పెద్దల వ్యవహారశైలి.. కాసులుంటేనే శ్రీవారి దర్శనం!
ఒక సినిమా థియేటర్‌లో..... అన్ని క్లాస్‌లు కలిపి వెయ్యి సీట్లున్నాయి. అందులో సగం అంటే 500 సీట్లు ఫస్ట్ క్లాస్. మిగిలిన సీట్లలో కింది తరగతుల టిక్కెట్లు ఉంటాయి. అయితే, ఫస్ట్ క్లాస్ సీట్ల సంఖ్యను పెంచితే
ఒక సినిమా థియేటర్‌లో..... అన్ని క్లాస్‌లు కలిపి వెయ్యి సీట్లున్నాయి. అందులో సగం అంటే 500 సీట్లు ఫస్ట్ క్లాస్. మిగిలిన సీట్లలో కింది తరగతుల టిక్కెట్లు ఉంటాయి. అయితే, ఫస్ట్ క్లాస్ సీట్ల సంఖ్యను పెంచితే కింది తరగతుల సీట్ల సంఖ్య తగ్గిపోతాయి. అంటే సాధారణ ప్రేక్షకులకు నానమూత్రంగా సీట్లు కేటాయిస్తారన్నామాట. సినిమా థియేటర్ల యజమాని ఆదాయం పెరగాలంటే టికెట్ల ధరయినా పెంచాలి లేదా ఉన్న సీట్లలో తక్కువ ధర సంఖ్య తగ్గించాలి. అంతే తప్ప అదే థియేటర్‌లో అదనపు కుర్చీలు వేయడం సాధ్యం కాదు కదా.
తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దలు చేస్తున్నది.. అచ్చం ఈ సినిమా థియేటర్ యజమాని వ్యవహారంలాగే ఉంది. శ్రీవారి దర్శనంలో రోజు రోజుకూ సామాన్య భక్తుల సంఖ్యను తగ్గించేసి డబ్బులు ఖర్చు చేసి దర్శనానికి పోగల భక్తుల సంఖ్యను పెంచేస్తోంది. దీనికి నిదర్శనమే క్రమంగా 50 రూపాయల టికెట్ల సంఖ్య తగ్గించేయడం, రూ.300 టికెట్ల సంఖ్య భారీగా పెంచడం. కాసులుంటే తప్ప వడ్డీ కాసులవాడి దర్శనభాగ్యం దొరకబోదన్న పరిస్థితి కల్పిస్తున్నారు. దర్శనం టికెట్ల వల్ల శ్రీవారి ఆదాయం పెరగవచ్చు గానీ సామాన్య భక్తులకు శ్రీవారికి మధ్య దూరం పెరిగిపోతుంది.
ఒకప్పుడు తిరుమలలో 50 రూపాయల దర్శనం ఉండేది. ఈ ప్రత్యేక క్యూలో వెళ్ళేంత సమయం లేని వారి కోసం సెల్లార్ దర్శనం పేరుతో వంద టికెట్లు ప్రవేశపెట్టారు. టిటిడిలో ఎంపిక చేసిన అధికారులు సిఫార్సు చేసిన వారికి ఈ టికెట్లు మంజూరు చేసేవారు. ఈ టికెట్లు తీసుకున్న భక్తులు వైకుంఠం క్యూషెడ్ల వేచి ఉండే పనిలేకుండా అప్పటికే కదులుతున్న క్యూలో కలిసిపోయి త్వరగా దర్శనం ముగించుకునేవారు. సెల్లార్ టికెట్లు రోజుకు 2 వేల నుంచి 3 వేల టికెట్లు ఇచ్చేవారు. వీటిని ప్రధానంగా పోలీసు, రెవిన్యూ తదితర శాఖల వారు ఉపయోగించుకునేవారు.
అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన సెల్లార్ దర్శనం టికెట్ల మంజూరులో అవినీతి చోటుచేసుకుంటోందని గమనించిన అధికారులు దాన్ని రద్దు చేశారు. ఐవైఆర్ క్రిష్ణారావు ఈఓగా ఉన్నప్పుడు శీఘ్ర దర్శనం పేరుతో 300 రూపాయల టికెట్లను ప్రవేశపెట్టారు. అధికారుల సిఫార్సు అవసరం లేకుండా ఎవరైనా క్యూలో వెళ్ళి టికెట్లు కొనుగోలు చేసి దర్శనానికి వెళ్లేందుకు అవకాశం కల్పించారు. దీనికి విశేషమైన స్పందన లభించింది. ఇటీవల దాకా తిరుమలలోని కౌంటర్లలో 300 రూపాయల టికెట్లు ఇచ్చేవారు.
అసలు 300 రూపాయలు టికెట్లు ఎందుకు పెంచుతూ పోతున్నారంటే భక్తులంతా సాధ్యమైనంత వరకు ప్రణాళికా బద్ధంగా తిరుమలకు రావాలనే ఉద్దేశంతోనే అని చెబుతున్నారు. ఆన్‌లైన్ టికెట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రణాళికా బద్ధంగా వచ్చే వారి సంఖ్య పెరిగింది. దర్శనం సమయానికంటే రెండు మూడు గంటల ముందుగా రావడం, రెండు మూడు గంటల్లో దర్శనం ముగించుకోవడం తిరిగి వెళ్ళిపోవడం దీని వల్ల తిరుమలపై అన్ని విధాలా ఒత్తిడి తగ్గుతోంది. భక్తులూ ఇబ్బందులు తప్పుతున్నాయి. మంచిదే. ఉచిత దర్శనం టికెట్లూ ఆన్‌లైన్‌లో పెడితే టిటిడి ఆశిస్తున్నట్లు ప్రణాళికాబద్ధంగా దర్శనానికి వచ్చేవారి సంఖ్య ఇంకా పెరుగుతుంది. డబ్బులు పెట్టుకోలేని పేద భక్తులూ ఆన్‌లైన్ టికెట్లు తీసుకుని ప్లాన్‌గా దర్శనానికి రాగలరు. ప్రస్తుత విధానం వల్ల ఎవరైతే దర్శనం కోసమే 300 రూపాయలు పెట్టుకోగలరో వారు మాత్రమే ప్లాన్‌గా రాగలరు.
శబరిమల అయ్యప్పను దర్శనం చేసుకోవడానికి ఆన్‌లైన్ ఉచిత టిక్కెట్లూ అందుబాటులో ఉన్నాయి. భక్తులు తన ఫోటో, గుర్తింపుకార్డుతో ఆన్‌లైన్‌లో టిక్కెట్టు బుక్ చేసుకోవచ్చు. దర్శన సమయం కేటాయయిస్తారు. ఇది భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉంది. ఇలాంటి విధానాన్ని టిటిడి కూడా ప్రవేశపెట్టవచ్చు. శ్రీవారి దర్శనం కోసం లక్షల మంది వస్తున్నమాట వాస్తవం. డిమాండ్ ఉంది అని దర్శనం కోసం ధర నిర్ణయించడం ఆ ధర పెంచుకుంటూ పోవడం తక్కువ ధర టిక్కెట్టు రద్దు చేయడం.. అధర్మం. సాధ్యమైనంత వరకు భక్తులందరినీ సమానంగా చూడాలి. శ్రీవారి దర్శనానికి సమాన అవకాశం కల్పించాలి. ఎవరి శక్తి మేరకు వాళ్ళు కానుకలు సమర్పించుకుంటారు. దీన్నే ఆదాయం చూడాలి.