భగవంతుడికి ఇన్ని రూపాలు ఎందుకు ఉన్నాయి?
శివుడనో, మాధవుడనో, కమలభవుడనో, పరబ్రహ్మనో ఎవరిని నిర్ణయించిరిరా, నినెట్లాఆరాధించిరిరా.... అని త్యాగరాజ స్వామి భగవంతుడిని కీర్తించారు. తనకు బాగా ఇష్టమైన తన తండ్రిగారు వారసత్వంగా అందించిన రామ నామాన్న, రామ భక్తిని, రామచంద్ర మూర్తి రూపాన్ని మదిలో నిలుపుకున్నారు. ఆ నామమే ఆయనకు భవ సాగరతరణానికి హేతువు అయ్యింది. ఆ రూపమే ఆయనకు విష్ణు సాయుజ్యాన్ని ప్రసాదించింది.
నిర్గుణ, నిర్వికార, నిర్విశేష, కేవల శుద్ద, బుద్ద పరమాత్మ స్వరూపాన్ని ఆయన రామభద్రుడిగా కొలుచుకున్నారు. మరొకరు ఈశ్వరుడిగా తలుస్తారు. ఇంకొకరు ఆదిపరాశక్తిగా భావన చేస్తారు. వేరొకరు తాము చేసే పనిలోనే దైవాన్ని చూడగలుగుతారు. దానినే తపస్సుగా భావన చేస్తారు. ఎవరు ఏ రూపంలో కొలచినా, తలచినా, పిలిచినా పరమాత్మ కరుణను ఆసాంతం సొంతం చేసుకోవడమే పరమావధి. ఒక్కో రూపానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ఒక్కో రూపానికి ఒక్కో పరమార్థం ఉంటుంది.
తెలిసి రామ భజన అని త్యాగయ్య చెప్పినట్లుగా ఏ రూపాన్ని కొలచినా, ఏ రూపంలో భగవంతుడిని పిలిచినా ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. ధర్మ మార్గంలో చరిస్తూ పరిపూర్ణంగా దైవానుగ్రహాన్ని సొంతం చేసుకోవడం ముఖ్యం. మీకు నచ్చిన రూపాన్ని ఆరాధించండి. మీకు బాగా నచ్చిన రూపాన్ని ప్రేమించండి. కానీ... ఆ ప్రేమ అనంతమైనదిగా ఉండాలి. ఆ ప్రేమ మీరు నమ్మిన ఆ భగవంతుడిని కూడా కదిలించగలగాలి.