ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : శనివారం, 14 మే 2016 (11:16 IST)

15 నుంచి పద్మావతి పరిణయోత్సవాలు... సర్వం సిద్ధం...

తిరుమల పద్మావతి, శ్రీనివాసుల పరిణయోత్సవాలకు తిరుమల గిరులు సిద్ధమయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా తితిదే ఈ మారు జరిగే ఉత్సవాలకు అంగరంగవైభవంగా ఏర్పాట్లు చేసింది. స్వర్ణ దేవాలయం తలపించేలా బంగారు వర్ణంతో పరిణయోత్సవ వేదికను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. పూణేకు చెందిన శ్రీ వేంకటేశ్వర ఛారిటబుల్‌ ట్రస్టు నిర్మాణ, అలంకరణ పనులు ఉచితంగా చేపట్టింది. ఆదివారం నుంచి ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి.
 
సాయంసంధ్య వేళల్లో నారాయణగిరి ఉద్యానవనంలో శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లి మండపంలో నిత్య వధూవరులైన తిరుమలేశునికి, దేవేరులకు ఎదుర్కోలు ఉత్సవం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహంగా, శాస్త్రోక్తంగా తితిదే నిర్వహించనుంది. అనంతరం స్వామివారికి ఆస్థానం జరుగనుంది. 
 
ఆస్థానంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి వేదాలు, పురాణాలు, సంగీత రాగాలు, కవితలు నివేదించనున్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల స్వరార్చన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పరిణయోత్సవ మండపాన్ని తితిదే ఉద్యానవనశాఖ రంగురంగుల పుష్పాలు, విద్యుద్దీపాలతో శోభాయమానంగా ముస్తాబు చేశారు.