తిరుపతి గంగజాతర ప్రారంభం - అర్థరాత్రి చాటింపు - బైరాగి వేషంలో భక్తుల మొక్కులు
రాయలసీమ జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారి పుట్టినిల్లైన అవిలాలలో చాటింపు తర్వాత చాటింపు ప్రారంభమైంది. అవిలాల నుంచి అమ్మవారికి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, సారెను తీసుకుని తిరుపతి పొలిమేరల్లో గంగ్మ తరపున తిరుపతికి చెందిన కైకాల వంశీకులు అందుకుని గంగమ్మ దేవస్థానం ఈఓ సుబ్రమణ్యంకు అందజేశారు.
బుధవారం తెల్లవారుజామున మూడు గంటలలోపు తిరుపతి పొలిమేరల్లో నాలుగు దిక్కులు తిరిగి పసుపు, కుంకుమ చల్లుతూ పూజలు చేసి చాటింపు వేశారు. గంగ జాతర పూర్తయ్యే వరకు నగరంలో నివసించే పట్టణ ప్రజలు బయటకు వెళ్ళకూడదన్నది చాటింపు అర్థం.
బుధవారం ఉదయం నుంచే గంగమ్మ ఆలయంలో సందడి నెలకొంది. బైరాగివేషలో భక్తులు గంగమ్మకు మొక్కులు తీర్చుకుంటున్నారు. విబూది, తెల్లనామం పూసుకుని, నల్లబొట్టు పెట్టుకుని రేళ్ల కాయల మాలలు ధరించి అమ్మవారి ఆలయానికి చేరుకుంటున్నారు. ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి చేతిలో వేపాకు, చీపురు పుల్లలు పట్టుకుని బూతులు తిడుతూ ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.