శనివారం, 9 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 4 డిశెంబరు 2018 (21:48 IST)

తిరుచానూరులో ఆధ్మాత్మిక శోభ.. శ్రీవారి లడ్డూలు అమ్మవారి చెంత కూడా....

తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు తెరలేచింది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాలకు అత్యంత వైభవంగా అంకురార్పణ జరిగింది. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవ ఘట్టం ప్రారంభమైంది. కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏయే వాహనసేవలు జరుగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఏర్పాట్లను టిటిడి చేసింది? 
 
కార్తీక మాసంలో ప్రతి యేడాది పద్మావతి బ్రహ్మోత్సవాలను టిటిడి ఆనవాయితీగా నిర్వహిస్తూ వస్తోంది. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలంటే భక్తులకు పెద్ద పండుగే. కలియుగ వైకుంఠుడు బ్రహ్మోత్సవాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంతే ప్రాముఖ్యత ఉంటుంది. అశేష భక్తజనులు వాహనసేవలకు తరలివచ్చి అమ్మవారిని దర్సించుకుంటుంటారు. మొదటగా నిన్న ఉదయం లక్ష కుంకుమార్చన ఘనంగా జరిగింది. రాత్రి అంకురార్పణతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉదయం 8.30 గంటల నుంచి 8.50 గంటల మధ్య వృశ్చిక లగ్నంలో ధ్వజారోహణ ఘట్టం పూర్తయ్యింది. 
 
పద్మావతి అమ్మవారు రోజుకో వాహనంపై ఊరేగనున్నారు. 4వ తేదీ చిన్న శేష వాహనం, 5వ తేదీ ఉదయం పెద్దశేషవాహనం, రాత్రి హంసవాహనం, గురువారం ఉదయం ముత్యపు పందిరి వాహనం, రాత్రి సింహవాహనం, 7వతేదీ ఉదయం కల్పవృక్షం, రాత్రి హనుమంతవాహనం, 8వతేదీ ఉదయం పల్లకీవాహనం, రాత్రి గజవాహనం, 9వతేదీ ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం బంగారు రథం, రాత్రి గరుడ వాహన సేవ, 10వతేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 11వతేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 12వతేదీ ఉదయం చక్రస్నానం ఘట్టాలను టిటిడి నిర్వహించనుంది.
 
ప్రపంచ నలుమూలల నుంచి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లను టిటిడి ఏర్పాటు చేసింది. భక్తుల మధ్య తోపులాటలు జరుగకుండా టిటిడి అధికారులు జాగ్రత్త వహిస్తున్నారు. దర్సనం పూర్తి చేసుకున్న భక్తులందరినీ ప్రసాదాలను అందజేస్తున్నారు. దిగ్విజయంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలను పూర్తి చేయాలన్న దృఢ సంక్పలంతో ముందుకు సాగుతున్నారు. 
 
బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా లడ్డూలను సిద్థం చేసింది టిటిడి. తిరుమల నుంచి తిరుచానూరుకు లడ్డూలను తీసుకువచ్చారు. ఉత్సవాల సమయం వరకు ప్రతిరోజు పదివేల లడ్డూలను భక్తులకు అందించనున్నారు. తిరుచానూరులో బ్రహ్మోత్సవ శోభ కనిపిస్తోంది. ఆధ్మాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది.