45 నిమిషాల్లోనే శ్రీవారి దర్శనం... కంపార్టుమెంట్లలో భక్తుల లేరు....
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి డైరెక్ట్ లైన్ కొనసాగుతోంది. చాలా రోజుల తర్వాత శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు కంపార్టుమెంట్లలో గంటల తరబడి వేచి ఉండకుండా నేరుగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. సర్వదర్శనంతో పాటు కాలి నడకన వెళుతున్న భక్తులు సైతం నేరుగా కంపార్టుమెంట్లలోకి వెళ్లి అక్కడ నుంచి డైరెక్ట్ క్యూ లైనులోకి ప్రవేశిస్తున్నారు.
45 నిమిషాల్లోనే కాలినడకన వచ్చిన భక్తులతో పాటు సర్వదర్శనం భక్తులకు దర్శనభాగ్యం లభిస్తోంది. సూర్యగ్రహణం ఎఫెక్టుతోనే డైరెక్ట్ లైన్ కొనసాగుతోందని టిటిడి అధికారులు చెపుతున్నారు. నిన్న శ్రీవారిని 38,442 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కంపార్టుమెంట్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఒక్క కంపార్టుమెంటులో కూడా భక్తులు లేరు. దర్శనానికి వచ్చిన భక్తులు నేరుగా దర్శనం చేసుకుంటుండటంతో ఈ పరిస్థితి కనబడింది. కాగా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం కోటీ 33 లక్షల రూపాయలు.
