వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు: ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శనం టిక్కెట్లు
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లాలనుకునే భక్తుల కోసం టీటీడీ 10,800 టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ టిక్కెట్ల అమ్మకాలు బుధవారం ఉదయం 11 గంటల నుంచి టీటీడీ సేవా ఆన్ లైన్ వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చునని తితిదే అధికారులు తెలిపారు. వీరందరినీ వైకుంఠ ద్వాదశి నాడు దర్శనానికి అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.
బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రతి గంటకూ 1200 టిక్కెట్లను విక్రయించనున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి నాడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, లక్షలాదిగా తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని నారాయణగిరి ఉద్యానవనంలో తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా ఉత్తరద్వార దర్శనం కోసం భద్రతా రీత్యా అనేక చర్యలు తీసుకున్నామని చెప్పారు.
