1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. TTD RathaSapthami Festival Celebrations 2016

రథసప్తమికి తిరుమల ముస్తాబు: ఒకేరోజున 7 వాహనాలపై శ్రీవారు!

TTD
రథసప్తమికి తిరుమల ముస్తాబవుతోంది. తిరుమలలో ఒకే రోజు బ్రహ్మోత్సవాల్ని తలపించే రథసప్తమి పర్వదినాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమిని పురస్కరించుకుని ఈ నెల 14న శ్రీవారికి ఆర్జిత సేవల్ని రద్దు చేసినట్లు తితిదే అధికారులు తెలిపారు. అలాగే ప్రత్యేక దర్శనాలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు.
 
రథసప్తమి (ఫిబ్రవరి 14-ఆదివారం) రోజున సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు శ్రీమలయప్పస్వామి వరుసగా ప్రతి రెండు గంటలకు ఓ వాహనంపై సప్త వాహనాల్లో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. వేకువ జామున 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో మహోత్సవం ప్రారంభం అవుతుందని తితిదే అధికారులు వెల్లడించారు. 
 
అనంతరండ వరుసగా చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనసేవలు స్వామివారికి జరుగుతాయి. మధ్యాహ్నం రెండు గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం ఘట్టం జరుగనుంది. రథసప్తమి ఆదివారం పూట రావడం విశిష్టమైనదని.. ఆ రోజున వారాంతం కావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా ఉండవచ్చునని తితిదే అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
దీంతో తిరుమలలో తితిదే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తిరువీధుల వెంట గ్యాలరీలను నిర్మించి, అక్కడి నుంచి స్వామివారిని దర్శించుకునే వీలు కల్పిస్తున్నారు. భక్తులకు గ్యాలరీల్లో నీడ కోసం పందిళ్లను కూడా నిర్మించారు. ఇంకా గ్యాలరీల్లోని భక్తులకు అన్నపానీయాలను అందించే దిశగా ఏర్పాట్లు చేసినట్లు తితిదే అధికారులు వెల్లడించారు.