శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Ganesh

అమరత్వ రహస్యాన్ని భోదించిన "అమర్‌నాథ్"

FILE
చుట్టూ మంచుకొండలతో, రకరకాల పువ్వులతో, సెలయేర్లతో, జలపాతాలతో... లోకంలోని అందాలన్నింటినీ తనలో దాచుకున్న ప్రాంతం కాశ్మీర్. పచ్చదనాల సొగసునంతా లోయల్లో నింపుకోవటమేగాక, ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కూడా ఇది ఆలవాలమయ్యింది. అందులోనూ పరమశివుడు పార్వతీమాతకు అమరత్వ రహస్యాన్ని చెప్పిన ప్రాంతమైన "శ్రీ అమర్‌నాథ్" క్షేత్రం చాలా ప్రతీతి.

శివ భగవానుడు మంచు శివలింగం రూపంలో దర్శనమిచ్చే ఈ అమర్‌నాథ్ క్షేత్రం... హిమాలయా పర్వతశ్రేణిలోని జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌కు 125 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి సుమారు 12,730 అడుగుల ఎత్తులో ఉంటుంది. 60 అడుగుల వెడల్పు, 25 అడుగుల లోతు, 15 అడుగుల ఎత్తు ఉన్న ఈ అందమైన, మనోహరమైన గుహ సహజసిద్ధమైనది.

హిమాలయాలు పరమశివుడి నివాసమని, ఆయన ఈ మంచుకొండల్లోనే సంచరిస్తుంటాడని హిందువుల నమ్మకం. అందుకే అమరనాథ్ గుహలో వెలసిన పరమశివుడు అమరనాథుడిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ స్వామివారు శ్రావణ పౌర్ణమినాడు ఉద్భవించారని చెబుతుంటారు. అందువల్లనే భక్తులంతా శ్రావణ పౌర్ణమినాడు దర్శనానికి లక్షల సంఖ్యలో తరలివస్తుంటారు.
FILE


అమరనాథ్ యాత్ర నాగపంచమి రోజున మొదలై, శ్రావణ పౌర్ణమి రోజున గుహవద్ద ముగుస్తుంది. ఈ ఊరేగింపును "ఛడి ముబారక్" అంటారు. ఈ విశిష్టమైన రోజున స్వామివారిని దర్శించుకుంటే, సర్వపాపాలు తొలగి కైలాసం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఊరేగింపు సందర్భంగా భక్తులు పరమశివుడిని భక్తిశ్రద్ధలతో కీర్తిస్తూ ఎంతో ఉత్తేజంగా, ఉల్లాసంగా పాల్గొంటారు.
ముస్లిం సోదరులకు సలామ్...!
అమర్‌నాథ్‌లో గుర్రాలు నడిపేవారు, డోలీలు మోసేవారు, సదుపాయాలు చేసేవారు, చివరకు స్థలపురాణం చెప్పేవారు అందరూ స్థానిక ముసల్మానులే..! "ఓం నమశ్శివాయ అనండి. ఆ శివుడే మీ భయాలను పోగొడుతాడని" నిలువెల్లా భక్తిభావాన్ని ప్రదర్శించే ఆ ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు....


స్థల పురాణం విషయానికి వస్తే... పరమశివుడు అమరుడు ఎలా అయ్యాడన్న తన సందేహాన్ని తీర్చమని పార్వతీదేవి శివుడిని కోరుతుంది. తాను ఈ రహస్యం చెప్పాలంటే, మనం ఇద్దరు తప్ప వేరే ఏ జీవి ఇక్కడ ఉండకూడదని.. అలా ఎవరయినా విన్నట్లయితే, వారు కూడా అమరులవుతారని, అది సృష్టి విరుద్ధమని.. పార్వతిదేవితో అంటాడు శివుడు.

ఎంత చెప్పినా పార్వతీదేవి ఆ రహస్యాన్ని చెప్పమని పట్టుబట్టడంతో.. శివుడు ఆమెను ఎలాంటి జీవీ నివసించని హిమాలయా పర్వతాల మధ్యనుండే ఒక గుహను అనుకూలమైనదిగా భావిస్తాడు. ఆ తరువాత పహల్‌గామ్‌లో నందిని, చందన్‌వాడలో చంద్రుడిని, మహాగునస్ వద్ద వినాయకుడిని, పంచతరుణి వద్ద పంచభూతాలను వదలి గుహ వద్దకు చేరుకుంటాడు శివుడు.

ఎవరూ లేరని నిర్ధారించుకున్న తరువాత శివుడు పార్వతీదేవికి అమరత్వ కథను చెప్పటం ప్రారంభిస్తాడు. అయితే కథను వింటున్న పార్వతీదేవి మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది. అది గమనించని శివుడు కథ మొత్తాన్ని చెబుతాడు. కథను పూర్తిగా ఆలకించావా దేవీ.. అని ఆమెను అడుగగా, తాను ఊకొడుతూ నిద్రలోకి జారిపోయానని అసలు విషయం చెబుతుందామె.

FILE
అయితే తాను కథ చెబుతున్నంతసేపు ఊకొట్టిందెవరని ఆలోచించిన శివుడికి, తన ఆసనం కిందనున్న రెండు పక్షి గుడ్లను గమనిస్తాడు. ఆ గుడ్లే అమరత్వ కథను విన్నాయి. వెంటనే గుడ్లులోంచి బయటికి వచ్చిన పక్షులు పావురాళ్లుగా మారాయి, వాటికి వెంటనే అమరత్వం సిద్ధించిందని... ఆ పావురాళ్లే ఈనాటికి గుహలో ఎగురుతున్నాయని భక్తుల విశ్వాసం.

ఎలా వెళ్లాలంటే... శ్రీనగర్ నుండి పహల్గామ్ చేరుకుని, అక్కడి నుంచి చందన్‌వాడి గవర్నమెంట్‌వారు ఏర్పాటు చేసిన ట్యాక్సీలలో యాత్ర ప్రారంభ స్థలానికి చేరుకోవాలి. ఇక అక్కడినుంచి ఎత్తయిన పర్వతమార్గంలో యాత్ర కొనసాగుతుంది. శేషనాగ్, పంచతరుణి, మహాగునస్ పర్వతం మీదుగా అమరనాథ్ గుహకు చేరుకోవాల్సి ఉంటుంది. నడక, గుర్రం, డోలీ.. ఇలా ఎవరి వీలునుబట్టి వారు ఎలా వెళ్లాలో నిర్ణయించుకోవచ్చు.

దారి పొడవునా ఉచిత వసతి, భోజన సదుపాయాలు శివభక్త సేవామండలి ద్వారా అందుతాయి. ఇవేగాక ప్రైవేటుగా నడుపుతున్న గుడారాల్లో అతి తక్కువ రుసుముతో వసతి, భోజన సదుపాయాలు లభిస్తాయి. కాశ్మీర్ చాలా ఉద్రిక్తమైన ప్రాంతం కాబట్టి, అక్కడ అడుగడుగునా మిలటరీ వాళ్లు కాపలా కాస్తుంటారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

ఇక్కడ చలి చాలా ఎక్కువ కాబట్టి జర్కిన్స్, టోపీలు, గ్లౌవ్స్, సాక్స్, షూస్ పర్యాటకులకు తప్పనిసరి. ఆక్సిజన్ అందక కొన్నిసార్లు ఇబ్బంది కూడా పడాల్సి ఉంటుంది. ఇందుకోసం డాక్టర్ సలహా మేరకు కొన్నిరకాల మందులు, కర్పూరం, హాల్స్, విక్స్ బిళ్లలు, ఇన్‌హేలర్స్ లాంటివి వెంట ఉంచుకోవాలి. అలాగే టార్చిలైట్, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు తప్పనిసరి.

ఎండకు ఎండ, చలికి చలి, అదిరిపోయే అద్భుత ప్రదేశం అమరనాథ్. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. అక్కడ కురిసే వడగళ్లవాన.. పచ్చటి గడ్డిపై ముత్యాలు చల్లిన దృశ్యంలాగా మైమరిపిస్తుంది. అటు భక్తిని ఇటు ఆహ్లాదాన్ని పంచే పరమశివుడు కొలువైన "శ్రీ అమరనాథ్ క్షేత్రాన్ని" ఒక్కసారి దర్శించుకుంటే చాలు జీవితం ధన్యమైపోయిందని అనిపించకమానదు.

ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే.... అమరనాథ్ యాత్రలో స్థానిక కాశ్మీర్ ప్రజలు చాలా సోదరభావంతో సహకరిస్తుంటారు. గుర్రాలు నడిపేవారు, డోలీలు మోసేవారు, సదుపాయాలు చేసేవారు, చివరకు స్థలపురాణం చెప్పేవారు అందరూ స్థానిక ముసల్మానులే..! "ఓం నమశ్శివాయ అనండి. ఆ శివుడే మీ భయాలను పోగొడుతాడని" నిలువెల్లా భక్తిభావాన్ని ప్రదర్శించే ఆ ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేం కదూ...!!