శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Ganesh

గోల్డెన్‌ ట్రయాంగిల్ టూర్ "పూరి-కోణార్క్-భువనేశ్వర్"

FILE
అభివృద్ధికి ఆమడదూరంగా ఉన్నట్లు అనిపించినా చారిత్రాత్మకంగా పేరున్న రాష్ట్రం ఒరిస్సా. ఆలయాలకు ప్రసిద్ధమైన ఒరిస్సాలో గోల్డెన్ ట్రయాంగిల్‌గా పేరుగాంచిన "పూరి-కోణార్క్-భువనేశ్వర్" ఆలయాలను జీవితంలో ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన పుణ్య స్థలాలు అంటే అతిశయోక్తి కాదు. ఓ వైపు పూరీ జగన్నాధుడు, మరోవైపు కోణార్క్ సూర్యదేవుడు, భువనేశ్వర్ రాజరాణి, ఆసియాలోనే అతిపెద్ద చిలక సరస్సు.. ఇలా ఒకటేమిటి ఎన్నో చారిత్రక అద్భుతాలను ఎంతో ఆప్యాయంగా పొదువుకున్న సుందర ప్రదేశం ఒరిస్సాను అలా పరికించి చూద్దామా..?!

ముందుగా పూరీ జగన్నాథ ఆలయం గురించి తెలుసుకుందాం. ఆదిశంకరాచార్యులు నిర్మించిన నాలుగు పీఠాలలో పూరీలోని జగన్నాథ స్వామి ఆలయం ఒకటి. పదకొండవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం 214 అడుగుల ఎత్తులో కట్టడంవల్ల చాలా దూరంనుంచే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాన ఆలయం చుట్టూ చిన్న చిన్న ఆలయాలతో, ఆలయానికి నాలుగువైపులా ప్రవేశ ద్వారాలతో అత్యంత సుందరంగా నిర్మించారు.

జగన్నాథ ఆలయంలో దైవ దర్శనానికి ఎప్పుడు కూడా క్యూ పద్ధతిని పాటించరు. ఎల్లప్పుడూ అత్యంత రద్దీగా ఉండే ఈ ఆలయంలో ప్రతిరోజూ కొన్నివేల మందికి అన్నదానం చేస్తారు. ప్రత్యేక దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు విడిగా టికెట్లు అందుబాటులో ఉంటాయి. కాగా.. చెల్లెలు సుభద్ర, తమ్ముడు బలరాములతో జగన్నాథుడు ఈ ఆలయంలో కొలువుదీరి ఉన్నాడు.

ఈ ఆలయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ముద్దుల సోదరి సుభద్ర ఎంతో దర్జాగా కనిపిస్తుంటుంది. చాలా పెద్దవైన ఈ విగ్రహాలను కొయ్యతో రూపొందించారు. 12 సంవత్సరాలకు ఒకసారి ఆ విగ్రహాలను కొయ్యతో తయారుచేసి పాత వాటి స్థానంలో కొత్తవాటిని ఉంచుతారని చెబుతుంటారు. వీటిని ఓ ఎత్తైన ఫలకంపై ఉంచి భక్తుల దర్శనానికి ఉంచుతారు.

జగన్నాథ ఆలయం దగ్గర్లో ఉన్న మ్యూజియం కూడా చూడదగ్గదే. దీంట్లో జగన్నాథుని చరిత్రను తెలిపే పెయింటింగులు అనేకం ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అంశమేంటంటే.. జగన్నాథ ఆలయానికి ఒక ప్రత్యేకమైన వంటగది, అది కూడా ప్రపంచంలోనే చాలా పెద్దది ఉండటం విశేషం. ఇక్కడ ప్రతిరోజూ 56 రకాల ప్రసాదాలను తయారు చేస్తారు. జూన్-జూలై నెలల్లో జరిగే జగన్నాథ రథయాత్ర పర్యాటకులకు, భక్తులకు కన్నులపండుగంటే నమ్మండి.

FILE
పూరీ నుంచి గంటన్నర ప్రయాణం చేస్తే కోణార్క్ సూర్య దేవాలయం చేరుకోవచ్చు. 13వ శతాబ్దంలో సూర్యుడి రథం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయానికి ముందు ఒక నృత్య మంటపం ఉంటుంది. దీనికి రెండువైపులా రెండు ఏనుగులు, వాటిపై సింహాలు ఉంటాయి. ఆలయం చుట్టూ 21 రథ చక్రాలను ఆనాటి శిల్పులు అత్యద్భుతంగా రూపొందించారు. వాటిలో ఒక చక్రం సమయాన్ని తెలుపుతుంటే, మరొకటి మానవ జీవన విశేషాలను చెబుతున్నట్లుగా ఉంటుంది. అలాగే ప్రతి రథ చక్రం ఒక్కో భావాన్ని తెలుపుతున్నట్లుగా ఉంటాయి.

ఆలయ గోడలపై పిల్లల్ని ఆకర్షించే శిల్పాలు, శృంగారపరమైన శిల్పాలు, ఆధ్యాత్మిక చింతన కలిగించేవి, తల్లి ఒడిలో కూర్చొని చిన్న పాప పెళ్లి ఊరేగింపుకు వెళ్తున్న శిల్పాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సూర్య దేవాలయానికి మూడువైపులా నిలువెత్తు సూర్య విగ్రహాలుంటాయి. అవి ఆకుపచ్చటి గ్రానైటే చేసినవి కాగా.. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో సూర్యుడి ప్రతి రూపాలుగా చెక్కినట్లు చెబుతుంటారు. అలాగే రథాన్ని లాగుతున్నట్లుగా ఆలయం ముందు భాగంలో గుర్రాలను చెక్కిన తీరు అబ్బురపరుస్తుంది.

ఇక భువనేశ్వర్‌ కూడా ఆలయాలకు చాలా ప్రసిద్ధి చెందినదే. పర్యాటకులకు చక్కని ఆహ్లాదాన్ని కలిగించే ప్రదేశంలో 11వ శతాబ్దానికి చెందిన లింగరాజు ఆలయం తప్పకుండా చూడాల్సిన పుణ్యక్షేత్రం. 127 అడుగుల ఎత్తున్న ఈ ఆలయం శిఖరం ఆకాశాన్నంటేలా రూపొందించారు. సున్నపు గచ్చు లేకుండా నిర్మించిన, ఈ ఆలయంలోపలి భాగాలు పర్యాటకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. అయితే ఈ ఆలయంలోకి హిందువులను మాత్రమే అనుమతిస్తారు.

భువనేశ్వర్‌కి 8 కిలోమీటర్ల దూరంలో దయానది ఉంది. ఈ నదీ తీరంలో ధౌలి పర్వతం ఉంది. ఎప్పుడూ యుద్ధాలు చేసే అశోక చక్రవర్తి ఈ ప్రాంతంలోనే శాంతికాముకుడిగా మారినట్లు పూర్వీకులు చెబుతుంటారు. ఒరిస్సాలో జరిగిన కళింగ యుద్ధం అశోకుడు బౌద్ధం స్వీకరించడానికి కారణమైన విషయం మనకు తెలిసిందే. దేశంలోని అతిపెద్ద చారిత్రక యుద్ధాలలో ఒకటైన కళింగ యుద్ధానికి గుర్తుగా, రాతిని తొలుచుకుని వస్తున్నట్టుగా ఒక ఏనుగును ఇక్కడ చెక్కారు. అలాగే ఈ ప్రదేశంలోనే ఆ కాలానికే చెందిన శాంతి స్థూపం తప్పకుండా దర్శించాల్సిన వాటిలో ఒకటని చెప్పవచ్చు.