శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Munibabu

దక్షిణ కాశి క్షేత్రం శ్రీకాళహస్తి

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో గల శ్రీకాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖీ నది సమీపాన వెలసిన దివ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరక్షేత్రం. పరమశివుడు స్వయంభువు లింగము రూపంలో ఇక్కడ వెలసియుండడం ఈ క్షేత్ర విశేషం. కాశీ క్షేత్రమును దర్శించిన వారికి కలిగే మోక్షము ఈ కాళహస్తి క్షేత్రము దర్శించినంతనే కలుగునని భక్తుల విశ్వాసం.

శ్రీకాళహస్తి స్థలపురాణం
శ్రీ అనగా సాలెపురుగు, కాళము అనగా నాగుపాము, హస్తి అనగా ఏనుగు అని అర్థం. ఈ మూడు ప్రాణులకు శివుడు ఈ ప్రాంతంలో మోక్షాన్ని ప్రసాదించాడు కాబట్టి ఈ ప్రాంతానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. స్వయంభు లింగంగా ఈ ప్రాంతంలో వెలసిన శివుని సాలెపురుగు, నాగుపాము చాలా భక్తితో పూజించేవట.

తమ భక్తికి ప్రతిరూపంగా సాలెపురుగు తన నోటి నుంచి వచ్చే దారంతో శివలింగానికి బట్టను అల్లేదట. అలాగే నాగుపాము తన మణిని స్వామి ముందు ఉంచేదట. అయితే ఇదే ప్రాంతంలోని ఓ ఎనుగు శివుని మీద భక్తితో స్వామిని సేవించడానికి తన తొండంతో నీళ్లు తెచ్చి స్వామి వారికి అభిషేకించేదట.

స్వామివారిపై పడ్డ నీళ్లు సాలెపురుగు అల్లిన బట్టను, నాగుపాము ఉంచిన మణిని చెల్లాచెదరు చేయడంతో వాటికి ఎనుగుపై కోపం వచ్చి దాని తొండంలోకి దూరాయట. దీంతో నొప్పిని భరించలేని ఏనుగు తలను కొండకు ఢీకొట్టి మరణించిందట. ఏనుగుతోపాటు పాము, సాలెపురుగులు కూడా మరణించాయట.

తనమీద భక్తితో ప్రాణాలు విడిచిన ఈ మూడు ప్రాణులకు శివుడు మోక్షాన్ని ప్రసాదించాడట. అలాగే ఈ ప్రాంతంలో నివశించిన పామరుడైన భక్త కన్నప్ప భక్తికి మెచ్చిన శివుడు అతనికి మోక్షాన్ని ప్రసాదించిన దివ్వ స్థలం కూడా ఇదేనని పురాణాలు పేర్కొంటున్నాయి.

దేవాలయ విశేషాలు
శ్రీకాళహస్తిలో వెలసిన శివుని శ్రీకాళహస్తీశ్వరుడు అని పేర్కొంటారు. పార్వతీ అవతారమైన శ్రీ జ్ఞానప్రసూనాంభ సమేతంగా స్వామివారు ఈ క్షేత్రంలో వెలసియున్నారు. శ్రీకాళహస్తిలో ఉన్న ఈ దేవాలయంలో దేశంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటిగా ఉంది.


ప్రధాన అలయానికి పక్కనే ఉన్న గాలిగోపురం అలనాడు శ్రీకృష్ణ దేవరాయులు తన విజయానికి ప్రతీకగా కట్టించాడని చరిత్ర చెబుతోంది. అలాగే శ్రీకాళహస్తి దేవాలయంలోని శిల్పకళా సంపద భక్తులను కట్టిపడేస్తుంది. దేవాలయానికి సమీపంలో ఉన్న అమ్మవారి సన్నిధి, పాతాళ విఘ్నేశ్వరుని సన్నిధి, భక్త కన్నప్ప గుడి లాంటివి భక్తులు చూచి తీరాల్సినవి.

అలాగే దేవాలయంలోని ఓ నిర్ణీత స్థలం నుంచి చూస్తే అన్ని గోపురాల శిఖర భాగాలు కన్పించడం ఈ అలయం యొక్క ప్రత్యేకత. ఇక్కడ నిర్వహించే రాహు, కేతు దోష నివారణ పూజలకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. ఈ క్షేత్రం నుంచి కొద్దిదూరం ప్రయాణిస్తే వెయ్యి లింగాల కోన అనే జలపాతాన్ని సైతం భక్తులు సందర్శించవచ్చు.

క్షేత్రంలో లభించే వసతి సౌకర్యాలు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం కల్పించే వసతి సౌకర్యాలతో పాటు ప్రైవేటు లాడ్జీలు, హోటల్స్ లాంటివి భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ధరలు సైతం అన్ని వర్గాల భక్తులకు అందుబాటులో ఉండడం విశేషం. అన్ని రకాల వసతి సౌకర్యాలతో బాటు రక్షణ, వైద్యం లాంటి సౌకర్యాలు కూడా ఈ క్షేత్రంలో అత్యంత మెరుగ్గా ఉన్నవనే చెప్పవచ్చు.

శ్రీకాళహస్తికి చేరుకోవడం చాలా సులభం
దేశంలోనే అత్యంత ప్రసిద్ధి పొందిన తిరుపతికి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలోనే ఈ కాళహస్తి క్షేత్రం వెలసియుండడం వల్ల ఇక్కడికి రవాణా సౌకర్యం అత్యంత మెరుగ్గా ఉంది. తిరుపతి నుంచి ప్రతి ఐదు నిమిషాలకు శ్రీకాళహస్తి వెళ్లే బస్సులు ఉన్నాయి. అలాగే అన్ని ఇతర జిల్లాల నుంచి దాదాపు నేరుగా శ్రీకాళహస్తికి బస్సు సౌకర్యం ఉంది.

దీంతోపాటు శ్రీకాళహస్తి అలయానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంది. నెల్లూరు జిల్లా గూడూరు జంక్షన్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు మార్గం కాళహస్తి గుండా వెళుతుంది. కాబట్టి ఈ దారిలో రైలు ప్రయాణికులు సులభంగా శ్రీకాళహస్తి చేరుకోవచ్చు.