శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. సముద్ర తీరాలు
Written By Munibabu

కళాసంపదల సాగరతీరం 'మహాబలిపురం'

తమిళనాడులోని సాగర తీరం వెంబడి వెలసిన ఓ కళాసంపదల ప్రదేశమే మహాబలిపురం. తమిళనాడు రాష్ట్ర రాజధానియైన చెన్నై నగరానికి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ ప్రదేశం తమిళనాడులోని ఆధ్యాత్మిక ప్రదేశమైన కంచి పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాగరతీరంతో పాటు కళాసంపదకు నిలయమైన ఈ ప్రదేశం యునెస్కో వారి హెరిటేజ్ ప్రదేశాల్లో ఒకటిగా పరిరక్షింపబడుతోంది.

చారిత్రక కళాసంపదకు నిలయం
సాగరతీరంతో పాటు అద్భుతమైన కళాఖండాలకు నిలయమైన ఈ ప్రదేశానికి విశిష్టమైన చరిత్ర కూడా ఉంది. ఏడవ శతాబ్ధంలో దక్షిణ భారత దేశాన్ని పాలించిన పల్లవ రాజుల రాజ్యంలోని ఓ ప్రముఖమైన తీర నగరమే ఈ మహాబలిపురం. అప్పటి పల్లవ రాజ్యాన్ని పాలించిన మామ్మల్ల రాజు పేరుపై ఈ నగరం కట్టబడినట్టుగా చరిత్ర చెబుతోంది.

పల్లవులు తమ పాలనలో ఈ ప్రాంతానికి అనేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వారికాలంలో ఈ నగరం రేవు పట్టణంగా ఉండేది. అప్పట్లో ఈ నగరం రేవు పట్టణంగా ఉండడం వల్లే ఇక్కడి కొండపై పల్లవులు ఓ లైట్ హౌస్‌ను సైతం నిర్మించారు.

పర్యాటకులను ఆకర్షించే కళాఖండాలు
ఆనాటి పల్లవుల వైభవానికి సాక్షంగా ఉన్న మహాబలిపురంలో చూడదగిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. సముద్రతీరం వెంబడి వెలసిన ఈ ప్రదేశంలో ఉన్న గోపురాలు, మండపాలు లాంటివి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఈ నిర్మాణాలన్నీ ఆనాటి రాజుల శిల్పకళా వైభవాన్ని చాటి చెప్పే సాక్షులుగా ఉన్నాయి.


వీటితోపాటు ఈ ప్రాంతంలో పాండవ రథాలు పేరుతో ఉన్న ఏకశిలా నిర్మాణాలు సైతం పర్యాటకులను ఆకర్షించేవే. ఈ ప్రాంతంలో ఉన్న అందమైన గార్డెన్ సైతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. దూరంగా కనబడే సముద్రం దానికి ముందు అద్భుతమైన శిల్పసంపద ఈ మహాబలిపురం ప్రత్యేకం. వీటితో పాటు సముద్రం ఒడ్డున ఉన్న సీషోర్ దేవాలయం కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది.

ఈ ప్రదేశాలన్నీ ఒకదానికొకటి సమీపంలోనే ఉంటాయి. ఓరోజుపాటు కేటాయించ గలిగితే ఈ ప్రదేశాలను అణువణువునా వీక్షించవచ్చు. ఈ నిర్మాణాలతోపాటు మహాబలిపురం బీచ్ సైతం చెప్పుకోదగినదే. సాయంత్రం వేళ ఇక్కడి బీచ్ పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. గవ్వలతో చేసిన వస్తువులతో పాటు సముద్ర చేపలతో చేసిన రకరకాల వంటకాలు పర్యాటకులకు ఓ చక్కని అనుభూతిని అందిస్తాయి.

చేరుకోవడం చాలా సులభం
మహాబలిపురం చేరుకోవడం చాలా సులభం. చెన్నై నగరానికి చేరుకుని అక్కడి నుంచి బస్సు మార్గం ద్వారా మహాబలిపురాన్ని సులభంగా చేరుకోవచ్చు. చెన్నై నగరంలోని ప్రధాన బస్సు స్టేషన్ నుంచి మహాబలిపురానికి అన్ని వేళలా బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. దాదాపు రెండుగంటల సమయంలో చెన్నై నుంచి మహాబలిపురం చేరుకోవచ్చు.

మహాబలిపురం టూరిజం ప్రాంతమైనా ఇక్కడ ఉన్న వసతి సౌకర్యాలు కాస్త తక్కువనే చెప్పవచ్చు. హోటళ్లు, స్టాల్స్ ఎక్కువగా అందుబాటులో ఉన్నా వసతి సౌకర్యాలు మాత్రం కాస్త తక్కువే. అందుకే ఈ ప్రాంతంలో బసచేయడానికి పర్యాటకులు అంతగా ఆసక్తి చూపరు.