శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. సముద్ర తీరాలు
Written By Ganesh

కేరళ మాన్‌సూన్ సోయగం.. వానల్లో హాయ్ హాయ్..!!

FILE
భారతావనిలోకి అడుగుపెట్టే తొలి నీలి మేఘం మెరుపులాగా మెరిసేది అక్కడే. తొలకరి వాన చినుకు కొత్త పెళ్లికూతురిలా ముస్తాబయ్యి కుడికాలు పెట్టి గృహ ప్రవేశం చేసేది అక్కడే. రుతురాగాల పల్లకిలో ఊరేగుతూ వచ్చి వర్షం హర్షాన్ని పంచేది కూడా అక్కడే. ఏ కాస్తో తెరపిచ్చినప్పుడు.. అల్లంత దూరంలోని ఆకాశరాజును, అనంతమైన నీలి జలరాశి అందాలనూ కలిపే మొట్టమొదటి హరివిల్లు కనిపించేదీ అక్కడే. అదే కేరళ.

ఈశాన్య రుతుపవన శోభకు ప్రకృతి పరచిన అందాల వేదిక అయిన కేరళలోని కొబ్బరాకుల గాలి మనసుమీద ఏ మంత్రం వేస్తుందో, మరేం మాయ చేస్తుందో మాటల్లో చెప్పలేంగానీ, వానాకాలంలో కేరళ మనోహర సోయగాల ఊయల అవుతుందంటే అతిశయోక్తి కానేకాదు.

అందుకేనేమో... ప్రపంచాన్నంతటినీ సృష్టించిన తరువాత విశ్రాంతి తీసుకోవాలని అనిపించిందట దేవుడికి. అప్పుడే తాను ఉండేందుకు ఓ సుందరమైన ప్రదేశాన్ని సృష్టించాలని అనుకున్నాడట. అందుకోసం నిత్యం పచ్చదనంతో కళకళలాడుతూ, ప్రశాంతత తొణికసలాడే ప్రాంతమైతే మరీ బాగుంటుందని ఆలోచించి "కేరళ"ను సృష్టించాడట. అందుకే అది "గాడ్స్ ఓన్ కంట్రీ"గా పేరుగాంచిందని స్థానికులు చెబుతుంటారు. ఓసారి కేరళలో అడుగెడితే అది నిజమని నమ్మకుండా ఉండలేం.
స్వర్గాన్ని తలపించే షికారు..!
కేరళవాసులకు జలమార్గాలు, నీటి రహదారులు నిత్యకృత్యమైనప్పటికీ... సందర్శకులకు మాత్రం, అదీ వానాకాలంలో.. గూటి పడవల్లో చేసే షికారు స్వర్గాన్ని తలపిస్తుంటుంది. "కెట్టువల్లమ్" అని పిలిచే ఈ పడవలు అచ్చంగా నీటిమీది ఇళ్లే. మేకు అన్నదే ఉపయోగించకుండా పూర్తిగా...


అన్నట్టు... చిటపట చినుకులు సందడి చేస్తున్నప్పుడు కేరళ అందమే వేరు. మామూలుగా వేసవిలోనో, చలి తక్కువగా ఉన్నప్పుడో, సెలవుల్లో ప్రయాణించేవారు వర్షాలు మొదలైతే కాలుకూడా కదపరు. అయితే కేరళ సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదించాలంటే.. వానకాలమే ఎంతో మంచిది. ఈ వాస్తవాన్ని గ్రహించిన చాలామంది ఇప్పుడు వర్షాల్లో షికారు చేస్తూ, ఎంచక్కా కేరళకు బయల్దేరుతున్నారు. దీంతో ఇక్కడ "మాన్‌సూన్ టూరిజం" సరికొత్త ట్రెండుగా మంచి ఊపందుకుంటోంది కూడా..!!

ఎటుచూసినా గలగలమంటూ పారే జల ప్రవాహాలు, హైలో హైలేస్సో అంటూ సాగిపోయే గూటి పడవలు, కనువిందు చేసే పండుగలు, ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానాలు, కళారూపాలు, నోరూరించే వంటకాలు... వీటన్నింటి కలబోత కేరళ. వీటిల్లో దేనిని వదిలేసినా అది అసంపూర్ణ చిత్రమే అవుతుంది.

"గాడ్స్ ఓన్ కంట్రీ"గా పేరుగాంచిన కేరళలో ముందుగా చెప్పుకోవాల్సింది 600 కిలోమీటర్ల మేర విస్తరించిన సముద్ర తీర ప్రాంతం గురించే. ఈ రాష్ట్రంలో ఉన్న 14 జిల్లాలకుగానూ... పదకొండు జిల్లాలలో విస్తరించి ఉన్న ఈ సముద్ర తీర ప్రాంతం.. ఆ ప్రాంతవాసులకు ప్రకృతి ప్రసాదించిన అతి గొప్ప వరం.

పోర్చుగీసు పర్యాటకుడు వాస్కోడిగామా తొలిసారిగా విడిది చేసిన కప్పాడ్, తిరువనంతపురంలోని కోవలం బీచ్‌లు కేరళలో ప్రధానంగా పేరెన్నిగన్నవి. వాణిజ్యానికి ఉపయోగపడుతూ నిత్యం కోలాహలంగా ఉండే ఈ బీచ్‌లలో, మలబార్ తీరంలో విహారానికి అనువైన బీచ్‌లు లెక్కలేనన్ని ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటీ దేనికదే సాటి. కోజికోడ్, వర్కల, తంగస్సేరి, చేరై.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి బీచ్‌లు ఎన్నో ఎన్నెన్నో...!!

FILE
ఇక కేరళ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది "బ్యాక్ వాటర్స్", వాటి అలలపై తేలియాడే "గూటి పడవలు". ఈ ప్రాంతంలోని సరస్సులు, కాలువలు అన్నీ కలగలసి బ్యాక్ వాటర్స్‌కు ఆధారంగా ఉండటమేగాక... ఆ రాష్ట్రంలో ఓ విలక్షణ జీవనశైలికి రూపకల్పన చేశాయనవచ్చు. దేశంలో మరెక్కడా లేనివిధంగా కేరళలోని చాలా ప్రాంతాల వాసులు అన్ని అవసరాలకూ రోడ్లకు బదులుగా జలమార్గాల్ని, నీటి రహదారుల్ని ఎక్కువగా వాడటం ఇక్కడ చూస్తాం.

కేరళవాసులకు జలమార్గాలు, నీటి రహదారులు నిత్యకృత్యమైనప్పటికీ... సందర్శకులకు మాత్రం, అదీ వానాకాలంలో.. గూటి పడవల్లో చేసే షికారు స్వర్గాన్ని తలపిస్తుంటుంది. "కెట్టువల్లమ్" అని పిలిచే ఈ పడవలు అచ్చంగా నీటిమీది ఇళ్లే. మేకు అన్నదే ఉపయోగించకుండా పూర్తిగా పనస చెక్కతో రూపొందించే ఈ హౌస్‌బోట్ల నిర్మాణశైలి మనల్ని ఆశ్చర్యంలో పడవేస్తుంది.

"వెనిస్ ఆఫ్ ద ఈస్ట్"గా పేరుగాంచి అలప్పుజలోనే ఈ హౌస్‌బోట్లు రూపుదిద్దుకుంటాయి. ఇవి వైశాల్యాన్నిబట్టి ఇద్దరు లేదా నలుగురు ఉండవచ్చు. అందులోనే అటాచ్‌డ్ బాత్రూంతోపాటు బెడ్‌రూము, హాల్, వంటగది, చిన్నపాటి బార్... లాంటి సమస్త సౌకర్యాలు కూడా ఉంటాయి. 80 మీటర్ల పొడవుతో ఉండే ఈ పడవల్లో పడవ నడిపేవాళ్లు కాకుండా, అవసరమైతే వండి వడ్డించేందుకు వంటవాళ్లు, గైడ్‌లు కూడా అందుబాటులో ఉంటారు.

కొట్టాయం జిల్లాల్లో విస్తరించిన వెంబనాడ్ సరస్సు ఈ హౌస్‌బోటింగ్ విహారానికి అనువుగా ఉంటుంది. ఈ సరస్సు కోచి వద్ద సముద్రంలో కలుస్తుంది. ఇక రెండో స్థానాన్న ఆక్రమించిన అష్టముది సరస్సులో గరిష్టంగా 8 గంటలసేపు పడవలో ప్రయాణించే సౌకర్యం కలదు. దాదాపు 900 మీటర్ల మేర పర్యటించగలిగే ఈ నిశ్శబ్ద తటాకాల్లో విహారం పర్యాటకుల మనస్సులను సేదదీరుస్తూ హాయినిస్తుంది.

ఇదే సరస్సులు, జలమార్గాలు "ఓనమ్" పండుగ సమయంలో మాత్రం కోలాహలంగా మారిపోతుంటాయి. ఈ సరస్సుల్లోని నిశ్శబ్దం స్థానంలో ఉత్సాహం ఉరకలు వేస్తుంటుంది. "స్నేక్ బోట్స్" అని స్థానికులు ముద్దుగా పిలుచుకునే సన్నటి పడవ పందేలలో యువతరం తలమునకలవుతూ సందడి చేస్తుంటుంది. ఈ రకంగా ఓనమ్ సరస్సులకు కూడా సరికొత్త సొబగులను అద్దుతుంది.