ప్రపంచ కప్ ఆర్చరీలో దీపిక నిష్క్రమణ: ప్రపంచ రికార్డును సమం చేసిన మరుసటి రోజే?!
భారత ఆర్చర్ దీపికా కుమారికి ప్రపంచ కప్ ఆర్చరీ టోర్నీలో చుక్కెదురైంది. గురువారం జరిగిన రికర్వ్ క్వార్టర్స్‌లో టాప్ సీడ్ దీపికా పరాజయం పాలవడంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆర్చరీ ప్రపంచ కప్ ఫస్ట్ స్టేజ్ మహిళల విభాగంలో ప్రపంచ రికార్డును సమం చేసిన మరుసటి రోజే దీపికా కుమారి ఈ టోర్నీ నుంచి అనూహ్యంగా తప్పుకోవాల్సి వచ్చింది. తద్వారా ఒక్క భారత షూటర్ కూడా వ్యక్తిగత విభాగాల్లో పతకాలు సాధించే రేసులో లేనట్లైంది.
ఆర్చరీ వరల్డ్ కప్ 62 బాణాల ర్యాంకింగ్ రౌండ్లో కొరియాకు చెందిన కి బోబే పేరిట ఉన్న 686 పాయింట్ల ప్రపంచ రికార్డును అదే పాయింట్లతో దీపికా కుమారి సమం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన రికర్వ్ క్వార్టర్స్‌లో దీపికా మాజా జాగర్ చేతిలో 4-6 పాయింట్ల తేడాతో ఖంగుతింది. ఇదే విధంగా లక్ష్మీరాణి, జయంత తాలుక్దార్ క్వార్టర్ ఫైనల్లో రాణించలేకపోయారు.