బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. శ్రీరామనవమి
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (15:03 IST)

రామనామ స్మరణతో.. పాపాలను పోగొట్టుకోండి..!

"రామ'' అనగా రమించుట అని అర్థం. అందుకే మనం హృదయాల్లో వెలుగొందుచున్న శ్రీ రాముడిని కనుగొనాలి. ఒకసారి పార్వతీ దేవి పరమశివుని  ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, “ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!” అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు
 
శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు. భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.
 
ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త వశంకరుడే ఈ తారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి, వారికి సధ్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట! అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట.